బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని గమేషన్ మిల్లు సెంటర్‌లో వైయస్ఆర్‌సీపీ మండల కార్యాలయం సమీపంలోని ఆ పార్టీ జెండా దిమ్మను రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధాం గ్రామంలో సచివాలయ శిలాఫలకాన్ని సోమవారం తెలుగుదేశం కార్యకర్త పొలుగుతో పొడిచి ధ్వంసం చేశాడని వైయస్ఆర్‌సీపీ నాయకులు తెలిపారు. వైయస్ఆర్‌సీపీ జెండా దిమ్మను, సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినవారిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రమణ్యం, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్ రహీమ్‌రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ గణపవరం పంచాయతీ వార్డు మెంబరైన పి.నాగరాజురెడ్డిపై ఇటీవల దాడిచేసిన వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు.