డోన్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని తారకరామనగర్‌లో ఎమ్మెల్యే కోట్ల పర్యటించారు. ఉదయం 7 గంటలకే ఎమ్మెల్యే ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకు న్నారు. పలువురు మహిళలు తీసుకువచ్చిన సమస్యలపై ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే సంబంధిత మున్సిపల్, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసి నిరుద్యోగ యువత జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రూ.1000 పెంచడానికి ఐదేళ్లు పట్టిందని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పింఛన్‌ను రూ.4వేలకు పెంచి పేదల కడుపు పేదలకు అండగా నిలిచారన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి వైపు నడుస్తుందని అన్నారు. డోన్‌లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. నియోజకవర్గంలో సాగు, తాగునీటి సౌకర్యాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు కోట్రికే ఫణిరాజ్, వలసల రామక్రిష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ లక్ష్మీరెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ టీఈ కేశన్నగౌడు, ఓబులాపురం శేషిరెడ్డి, మర్రి రమణ, మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రికే హరికిషన్, జిల్లా పార్టీ అధికార ప్రతినిధి విజయభట్టు, పాల్‌రాజు, చండ్రపల్లి ఆచారి, ఆంజనేయగౌడు, ఖాజా, రంగయ్యగౌడు, పుల్లయ్యగౌడు, లారీల బాషా, బీజేపీ నాయకులు వడ్డె మహారాజ్, తదితరులు పాల్గొన్నారు.