స్టీల్‌ప్లాంటు పరిరక్షణ తన ప్రధాన బాధ్యత అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన బుధవారం ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరానికి విచ్చేసి, సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ...... రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉక్కు కార్మికులకు అన్నివిధాలా సహాయ సహకారాలను అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న గర్భాం మాంగనీస్ గనులు, కింతాడ క్వార్జ్ మైన్స్, సారిపల్లి ఇసుక రీచ్‌లు నెలలోగా స్టీల్‌ప్లాంటుకు రెన్యువల్ చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ స్టీలుప్లాంటును భావి తరాల వారికి అందించడమే తన తొలి, తుది లక్ష్యమన్నారు. ఈ నెల 24వ తేదీలోపు విశాఖ ఎంపీ ఎం.శ్రీ భరత్‌తో కలిసి స్టీలుప్లాంటు యాజమాన్యంతో చర్చించి ఓ ప్రణాళికను తయారుచేసుకొని, కేంద్ర ప్రభుత్వం ముందు తమ ప్రతిపాదనలు ఉంచుతామన్నారు. ఎంపీ శ్రీభరత్ సహకారంతో విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనులు కేటాయింపునకు కృషి చేస్తామన్నారు. స్టీలుప్లాంటు ప్రైవేటీకరణ సమస్యను పరిష్కరించేంత వరకూ అవిశ్రాంత పోరాటాలకు ఉక్కు కార్మికులతో కలసి ఉంటానని హామీ ఇచ్చారు. ఉక్కు కర్మాగారం కోసం భూములిచ్చిన నిర్వాశితులకు అన్యాయం జరగనివ్వబోమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, కార్పొరేటర్లు బొండా జగన్, మొల్లి ముత్యాలునాయుడు, పల్లా శ్రీనువాస్, నిర్వాసిత నాయకులు పులి వెంకటరమణారెడ్డి, ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, మంత్రి రాజశేఖర్, జె.అయోధ్యరామ్, నీరుకొండ రామచంద్రరావు, వరసాల శ్రీనివాసరావు, కేఎస్‌ఎన్ రావు, విల్లా రామ్మోహన్‌కుమార్, జెర్రిపోతుల ముత్యాలు, గంధం వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |