అమాయకులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు రోజురోజుకీ కొంతపంథా ఎంచుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఎమ్మెల్యేల పేరిటా మోసాలకు దిగుతున్నారు. తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ పేరుతో సైబర్ కేటుగాళ్లు ఫేస్‌బుక్ నకిలీ ఎకౌంట్ తెరిచారు. రాజధాని ఎమ్మెల్యే పేరుతో ఎకౌంట్ క్రియేట్ చేసి సామాన్యులతో చాట్ చేస్తూ డబ్బులు అడుగుతున్నారు. తన పేరిట మోసాలకు పాల్పడుతున్నారని తెలుసుకున్న ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ వెంటనే స్పందించారు. తన పేరుతో ఎవరు డబ్బులు అడిగినా ఇవ్వొద్దంటూ చెప్పారు. ఇలాంటి మోసాల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆన్ లైన్ మోసాల బారిన పడి డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు. ఎమ్మెల్యే పేరిట సైబర్ కేటుగాళ్లు వసూళ్లకు పాల్పడడంతో నియోజకవర్గ ప్రజలు అవాక్కయ్యారు.