భారత రైల్వే సంస్థ ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలను సందర్శించే భక్తుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ సంస్థ ప్రత్యేక రైలు నడుపుతున్నట్టు ఐఆర్‌సీటీసీ రీజనల్ మేనేజర్ క్రాంతి సవర్కర్ తెలిపారు. బుధవారం శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస రైల్వేస్టేషన్‌లో ఆమె విలేకరులతో మాట్లాడారు. దేశ, విదేశాల్లో పర్యటిస్తున్న ప్రయాణికులకు ఐఆర్‌సీటీ సంస్థ ద్వారా కల్పిస్తున్న వివిధ టూర్ ప్యాకేజీలను వివరించారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల దైవ క్షేత్ర సందర్శనకు అయోధ్య, కాశీతో సహా ఆరు పుణ్యక్షేత్రాలకు సికింద్రాబాద్, విశాఖ నుంచి భారత్ గౌరవ ట్రైన్ నామకరణంతో రెండు రైళ్లు నడుపుతున్నట్టు ఆమె తెలిపారు. ఈ రెండు రైళ్లులో తీర్థయాత్రలకు వెళ్లే భక్తులకు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా చార్జీలను అందుబాటులో ఉంచామన్నారు. భక్తులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారంతో పాటు వసతి దైవక్షేత్రాల సందర్శనలకు ప్రత్యేక అవగాహన కల్పించే గైడ్లను ఏర్పాటు చేశామన్నారు. ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్, థర్డ్ ఏసీ, సెకెండ్ క్లాస్, ఏసీ బోగీల ద్వారా 716 మంది ప్రయాణికులు ఉంటారని, పిల్లలకు ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నాయన్నారు. రైల్వే రిజరేషన్ బుకింగ్ కౌంటర్లతో పాటు రైల్వేస్టేషన్‌లో ఉన్న జన ఆహార్ స్టాల్ వద్ద ఉన్న ఐఆర్‌సీటీసీ ప్రతినిధిని కలిసి టిక్కెట్లను బుక్ చేసుకొనే సదుపాయం ఉందన్నారు. సమావేశంలో ఐఆర్‌సీటీసీ ఎగ్జిక్యూటీవ్ సంఘ మిత్రరావు, స్థానిక స్టేషన్ మాస్టార్ ఎం.రవి, కమర్షియల్ ఇన్‌చార్జి గణేష్‌తోప ఉన్నారు.