బూతులు మాట్లాడే వ్యక్తి స్పీకర్ అయితే విపక్షాలకు న్యాయం జరుగుతుందా? అని వైయస్ఆర్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఎన్నికైన నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ హాజరు కాలేదని ఆరోపిస్తున్నారని, అయ్యన్న పాత్రుడు గత ఐదేళ్లుగా మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకోవాలని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నేత డాక్టర్ సీదిరి అప్పలరాజు అన్నారు. ఏ ఒక్కరోజైనా బూతులు మాట్లాడకుండా ఆయన మాట్లాడారా? అని నిలదీశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన రోజే అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలు ఈ సందర్భంగా అప్పలరాజు మీడియాకు ప్రదర్శించారు. ఇలాంటి వ్యక్తిని తీసుకొచ్చి స్పీకర్ ను చేస్తుంటేఅసెంబ్లీకి వచ్చిన అన్ని పార్టీల వారికీ న్యాయం జరుగుతుందనుకోగలమా? ఓడిపోయాడు గానీ చావలేదు అన్న వ్యక్తి చేతిలో పెత్తనం పెడితే ఆయన ఇదే జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రజల తరఫున గొంతు వినిపించడానికి అవకాశం కల్పిస్తారని ఎలా అనుకుంటాం? అని ప్రశ్నించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు సైతం పార్టీలను అంటగట్టి పేపర్లో రాయడం ఎప్పుడైనా ఇప్పుడే చూస్తున్నామని, ప్రజలు, ప్రజాస్వామ్య వాదులు, మేధావులంతా గమనించాలని కోరారు.