స్పీకర్ గా అయ్యన్నపాత్రుడిని ఎన్నుకోవడం తెలుగుదేశం పార్టీ సొంత నిర్ణయమని.. అయితే రాజ్యాంగం పరంగా సంప్రదాయాలను తుంగలో తొక్కి మీరు అయ్యన్న పాత్రుడిని స్పీకర్ గా నిర్ణయించేటప్పుడు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు సంప్రదించారా? అని వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు ప్రశ్నించారు. ’’తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలను వీడియోలు పరిశీలించాలన్న ఆయన…. శాసనసభ్యుడిగా లేనప్పుడు జగన్మోహన్ రెడ్డిగారిని ఉద్దేశించి బూతులు మాట్లాడిన తీరు ఏ విధంగా మర్చిపోతామన్నారు. అంటే శాసనసభలోకి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు రాకూడదు, మాట్లాడకూడదు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే అయ్యన్న పాత్రుడిని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారని ఆయన ఆక్షేపించారు. అయ్యన్న పాత్రుడు తన మిత్రుడితో కూర్చొని వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు, పూర్తిగా పామును కొట్టినట్లు కొట్టి చంపేయాలంటూ మాట్లాడిన వీడియోను ఈ సందర్భంగా టీజేఆర్ సుధాకర్ బాబు మీడియాకు ప్రదర్శించారు. సభను నడిపే స్పీకర్ గారు ప్రతిపక్ష నాయకుడిని చంపాలని మాట్లాడారు. అంత కఠినమైన, దారుణమైన మనస్తత్వం కలిగిన వారు రేపు సభలో మాట్లాడనిస్తారా? ప్రజా సమస్యలు మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? మీరు అసలు చట్టసభను గౌరవించారా? కేవలం వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని అవమానపర్చడానికేనా మీ అందరినీ గెలిపించి అసెంబ్లీకి పంపినది.’’ అని సుధాకర్ బాబు ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ప్రజలను మభ్యపెట్టేందుకు కాకుండా మీరు ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చాలని కోరుతున్నామన్నారు.