దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో వచ్చేనెల 19 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్న శాకంబరీ ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఈవో రామారావు సంబంధిత అధికారులు, అర్చకులకు సూచించారు. ఉత్సవాల నిర్వహణపై బుధవారం మహామండపంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాకంబరీ ఉత్సవాల నిర్వహణలో గతంలో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని మరింత మెరుగ్గా ఏర్పాట్లు చేసి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలని ఆయన సూచించారు. వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తమకు కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. రైతులు, వ్యాపారులు, ప్రజలు తమకు తోచిన విధంగా కూరగాయలు పండ్లు, అకుకూరలు అమ్మవారికి సమర్పించాలన్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు భక్తులు సహకరించాలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడిపంటలతో రాష్ట్రం, రైతులు సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ శాకంబరీ ఉత్సవాలను అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించనున్నట్టు తెలిపారు. జూలై 6 నుంచి ఆగస్టు 5 వతేదీ వరకు ఆషాఢమాసం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున కనకదుర్గమ్మవారికి పవిత్ర సారె సమర్పించనున్నందున అందుకు దేవస్థానం తగు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. జులై 14వ తేదీన హైదరాబాద్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బంగారు బోనం సమర్పించనున్నారని తెలిపారు. సమావేశంలో స్థానాచార్యుడు శివప్రసాదశర్మ, ముఖ్య అర్చకుడు శ్రీనివాస శాస్త్రి, ఈఈలు కోటేశ్వరరావు, రమాదేవి డీఈఈలు ఏఈఈలు ఏఈవోలు పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు.