ఒడిసా నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తున్న ముఠాను పలాస రైల్వే పోలీసులు బుధవారం మధ్యాహ్నం రైల్వే స్టేషన్‌లో పట్టుకున్నారు. రూ.6 లక్షల విలువైన 39 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రైల్వే సీఐ కె.వెంకటరావు కథనం మేరకు.. మహారాష్ట్ర థానే పట్టణానికి చెందిన జబార్ నజీర్ సయ్యద్, పూణే పట్టణానికి చెందిన శ్యామ్ ఒడిసా రాష్ట్రం ఆర్.ఉదయగిరి ప్రాంతంలో గంజాయి కొనుగోలు చేసి రైలులో మహారాష్ట్ర వెళ్లడానికి పలాస రైల్వే స్టేషన్‌కు బ్యాగులతో చేరుకున్నారు. ఫ్లాట్‌ఫారం-2లో వీరిద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతుండడంతో వారి బ్యాగులను రైల్వే పోలీసులు తనిఖీ చేశారు. అందులో గంజాయి ప్యాకెట్లు గుర్తించారు. అంతలో వారిద్దరూ పరారీ అయ్యేందుకు ప్రయత్నించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విశాఖపట్నం రైల్వే కోర్టులో హాజరుపరుస్తున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి పట్టుకున్న పోలీసులను ఈ సందర్భంగా అభినందించారు. రాష్ట్రాన్ని గంజాయి రహితంగా చేయాలని ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిన రోజునే గంజాయి పట్టుబడడం ప్రాధాన్యత సంతరిం చుకుంది. కార్యక్రమంలో ఎస్‌ఐ ఎం.మధుసూధనరావు, ఎస్‌కె.షరీఫ్, ఏఎస్‌ఐ కోదండరావు, సిబ్బంది పాల్గొన్నారు.