శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలంలో దొంగలు రెచ్చిపోయారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా చోరీలకు తెగబడ్డారు. రెండుచోట్ల 36 తులాల బంగారు ఆభరణాలను అపహరించారు. దీనిపై బాధితులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగిరికటకం గ్రామానికి చెందిన రేజేటి శ్రీనివాసరావు ఇంటిలో 20 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఎస్‌ఐ మధుసూదనరావు తెలిపారు. శ్రీనివాసరావు పెద్ద కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు. కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోవడంతో శ్రీనివాసరావు తన కుటుంబంతో కలిసి ఈనెల 21న ఇంటికి తాళాలు వేసుకొని హైదరాబాద్ వెళ్లారు. బుధవారం తిరిగి ఇంటికి చేరుకోగా తాళాలు తీసి ఉండడంతో లోపలికి వెళ్లి చూశారు. బీరువా, కప్‌బోర్డులు తెరచి ఉన్నాయని, అందులోని 20 తులాలు బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు సంఘటనా స్థలాన్ని క్లూస్ టీంతో పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మండల కేంద్రం జలుమూరు మజ్జిలి వీధికి చెందిన కిళారి జగన్నాథరావు ఇంటిలో 16 తులాల బంగారం చోరీకి గురైంది. బాధితుడి వివరాల మేరకు.. మూడు రోజుల కిందట ఇంటికి తాళాలు వేసుకొని జగన్నాథరావు కుటుంబం వైజాగ్ వెళ్లింది. బుధవారం ఇంటికి చేరుకోగా తాళాలు తీసి ఉండడంతో లోపలకు వెళ్లి పరిశీలించారు. బీరువాలో ఉన్న 16 తులాల బంగారు ఆభరణాలు చోరీకీ గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీనిపై ఎస్‌ఐ మధుసూదనరావుకు వివరణ కోరగా.. జలుమూరులో దొంగతనం జరిగినట్లు సమాచారం ఉందని, ఇంకా ఎటువంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు. నగిరికటకం, జలుమూరులో ఒకే తరహాలో తాళాలు వేసివున్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకొని దొంగతనాలు జరగడంతో పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు భయాందోళన చెందుతున్నారు.