రాష్ట్రంలో పలు జిల్లాల్లో డయేరియా ప్రబలుతుండటంపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ఆయన శుక్రవారం జగ్గయ్యపేటలో డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట సామాజిక ఆరోగ్యకేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ, జగ్గయ్యపేట ప్రాంతంలో ఆరుగురు డయేరియాతో మృతి చెందితే అధికారులు సంఖ్య తగ్గించి ప్రభావాన్ని తగ్గించి చూపే ప్రయత్నం చేయటం తగదన్నారు. ప్రభుత్వం డయేరియా మృతులకు కనీసం రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కనీసం ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించే పరిస్థితిలో గ్రామ పంచాయతీలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. షేర్‌మహ్మద్‌పేటతో పాటు పలు గ్రామాలకు కృష్ణాజలాలను అందించాలని కోరారు. ఏఐఐబీ ద్వారా పురపాలకసంఘాల్లో పైపులైన్ల విస్తరణ, మార్పిడికి మంజూరు చేసిన నిధులలో గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటంతో పనులు జరగలేదని, ప్రస్తుత ప్రభుత్వం శ్రద్ధ చూపి తిరిగి పనులు చేపట్టాలని కోరారు. జగ్గయ్యపేటలో పైపులైన్ మార్పిడి పనులకు రూ.5కోట్లు ఇవ్వాలని, పంచాయతీలకు రూ.5లక్షలు ఇవ్వాలని, ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచాలని, మందులు ఎప్పుడు ఉండేలా చూడాలని, సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఆయనతో పాటు సీపీఐ నేతలు సుబ్బరావమ్మ, జిల్లా కార్యదర్శి డీవీ కృష్ణ, ఎన్‌సీహెచ్ శ్రీనివాస్, నాగమణి, హనుమంతురావు, కోటకృష్ణ, రాము, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.