పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, గురజాల మండలాల పరిధిలో రెవెన్యూ శాఖలో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని జేసీ శ్యాం ప్రసాద్ తెలిపారు. శుక్రవారం పిడుగురాళ్లలో పౌరసరఫరాల శాఖ గోడౌన్‌ను అకస్మిక తనిఖీ చేసిన అనంతరం ఆయనతో ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి, దాచేపల్లి తహసీల్దార్ గీతావాణిలు రెండు రోజుల క్రితం రెవెన్యూ ధ్రువపత్రాలపై ఫోర్జరీ సంతకాల విషయంపై చర్చించారు. దాచేపల్లి మండలంలో పట్టాదారు పాస్ పుస్తకాలు నకిలీలు వున్నాయని, భూమి లేకుండా ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేయడం గతంలో జరిగాయని గుర్తు చేశారు. కాట్రపాడుకు చెందిన నరేంద్ర వర్మ అధికారుల సంతకాలను ఫోర్జరీచేసి కార్యాలయ ముద్రను వేయడంలో ఓ విఆర్‌ఏ తనయుడు వున్నట్లు గుర్తించడం జరిగిన తరువాత పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంపై జేసీ శ్యాంప్రసాద్ స్పందిస్తూ రెండు రోజుల్లో దాచేపల్లి మండలంలో భూరికార్డులను తనిఖీ చేసేందుకు ప్రత్యేక అధికారులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మాచవరంమండలంలోని పులిచింతల ప్రాజెక్టుకు చెందిన కొంత భూమిలో బయటి వ్యక్తులు చొరబడి రికార్డుల్లో నమోదు చేయించుకోవడం, బ్యాంక్ రుణాలు పొందటం తనదృష్టికి వచ్చిందని, ఈ విషయంపై జిల్లా డీఆర్వోను నివేదిక ఇవ్వాలని మూడుసార్లు కోరినప్పటికీ కుంటిసాకులు చెప్పాడన్నారు. పిడుగురాళ్ల మండలంలోనూ భూముల అవకతవకలపై పూర్తిస్థాయి విచారణ జరుగుతుందని జేసీ వివరించారు. అదేవిధంగా ఎన్నికల ఫలితాల అనంతరం రెవెన్యూ అధికారులు ఎటువంటి భూములైనా ఆన్‌లైన్ చేయవద్దని, కేవలం విద్యార్థుల ధ్రువపత్రాలు మాత్రమే అందించాలని సూచించారు. కొందరు రెవెన్యూ అధికారులు బదిలీల మాయలో పడి ఏం చేసినా తెలియదనే కోణంలో భూముల ఆన్‌లైన్ వ్యవహారాలను చక్కపెడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని జేసీ అన్నారు.