యూనివర్శిటీలలో వీసీలను భయపెట్టి బలవంతపు రాజీనామాలు చేయించడం సమంజసం కాదని మాజీ మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. యూనివర్శిటీలలో వీసీల బలవంతపు రాజీనామాలపై గుంటూరులోని తన నివాసంలో మాజీ మంత్రి మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ..... వీసీల రాజీనామాల అంశం చాలా బాధాకరం, నేను కూడా విశ్వవిద్యాలయంలో చదువుకుని, అధ్యాపకుడిగా పనిచేశాను. ప్రభుత్వాలు వస్తుంటాయి, మారుతుంటాయి, యూనివర్శిటీలు అంటే ఒక మేధాశక్తిని తయారుచేసే కర్మాగారాలు, సీఎంలు మారుతుంటారు, కానీ యూనివర్శిటీలో వీసీని అపాయింట్‌చేస్తే అతని కాలపరిమితి పూర్తయ్యే వరకూ ఎవరూ కదిలించరు. యూజీసీ నిబంధనల మేరకు పనిచేస్తారు, కానీ ఈ రోజు జరుగుతున్న పరిస్ధితులు చాలా బాధాకారం. గతంలో టీడీపీ అపాయింట్ చేసిన వీసీలను వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించింది, విద్యా వ్యవస్ధను భ్రష్టు పట్టించవద్దు, ఎవరిపైన అయినా ఆరోపణలు, అభియోగాలు వస్తే గవర్నర్ దృష్టికి తీసుకువెళ్ళాలి, ఆయన కమిటీ వేసి తప్పులు జరిగి ఉంటే ఆయన నిర్ణయం తీసుకోవాలి, అంతేకానీ ఇలా భయపెట్టి రిజైన్ చేయడం సమంజసం కాదని అయన తెలిపారు.