తీరం కోతకు గురికాకుండా చర్యలు చేపడతామని శ్రీకాకుళం, పీజీ పేట మత్స్యకారులకు ఎమ్మెల్యే గొండు శంకర్ భరోసానిచ్చారు. పెద్దగనగళ్లవానిపేటలో నాగావళి నది కలిసే సముద్రతీర ప్రాంతాన్ని మత్స్యకారులతో కలిసి సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గొండు శంకర్ పరిశీలించారు. నాగావళి వరదల కారణంగా తీరం భారీగా కోతకు గురికావడంతో పాటు సమీపంలోని అక్రమ చేపల చెరువుల తవ్వ కాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతోందని మత్స్యకారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయా ప్రాంతాలను పరిశీలించిన శంకర్ తీరం కోతకు గురికాకుండా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు. అలాగే మత్స్య కారుల సమస్యలను పరిష్కరిస్తామని గొండు శంకర్ పేర్కొన్నారు.