ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంటి విషయంలో ఓ ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పంలోని ఇంటి స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు డిప్యూటీ సర్వేయర్ ఈ లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం.. తాజాగా ఆ ఉద్యోగిపై చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో చిత్తూరు జిల్లా కుప్పంలో ఇంటి నిర్మాణానికి సిద్ధమయ్యారు. శాంతిపురం మండలం కడపల్లె పంచాయతీ శివపురం దగ్గర స్థలాన్ని కొనుగోలు చేయగా.. నేషనల్ హైవే పక్కనే ఉంది.
చంద్రబాబు ఇంటి నిర్మాణం కోసం కొనుగోలు చేసిన స్థలం వ్యవసాయ భూమి కావడంతో.. గృహ నిర్మాణం చేసేందుకు కుప్పం టీడీపీ నేతలు భూ వినియోగంగా మార్చి.. ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేయాలని దరఖాస్తును సంబంధిత ప్రభుత్వ కార్యాలయంలో అందజేశారు. అయితే ఈ స్థలాన్ని సబ్ డివిజన్ చేసేందుకు.. స్థానిక డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.1.80 లక్షల లంచాన్ని డిమాండ్ చేశారట. టీడీపీ నేతలు ఆ మొత్తాన్ని సర్వేయర్‌కు అందజేసిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు గత నెల 25, 26వ తేదీల్లో కుప్పం పర్యటనకు వెళ్లారు. సీఎం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో బస చేయగా.. అదే సమయంలో స్థానిక నేతల మధ్య ఈ లంచం వ్యవహారం చర్చకు వచ్చిందట. ఈ విషయం ఈ నోటా, ఆ నోటా.. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ దగ్గరకు చేరిందట. అప్పుడు ఆరా తీస్తే ఈ లంచం ఎపిసోడ్ బయటపడిందని చెబుతున్నారు. వెంటనే కలెక్టర్ సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషాతో శాఖాపరమైన విచారణ చేయించడంతో లంచం తీసుకున్నది నిజమేనని తేలిందట.
గత నెల 27న శాంతిపురం మండలానికే చెందిన ఓ రైతు.. డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్ రూ.లక్ష లంచం డిమాండ్ చేశారని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారట. ఈ అంశంపైనా విచారణ చేసిన అధికారులు.. రైతు నుంచి లంచం డిమాండ్ చేసింది నిజమేనని తేల్చారట. ఈ రెండు ఈ అంశాలపై సాయంత్రానికి నివేదిక ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ సర్వే ఏడీని ఆదేశించారట.. ఆ నివేదిక రాగానే డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్ చేశారట.. ఈమేరకు ఉత్తర్వులు జారీ చేశారట.
మరోవైపు కుప్పంలో చంద్రబాబు ఇంటి నిర్మాణం కొనసాగుతోంది.. టీడీపీ నేతలు దగ్గరుండి ఇంటి పనుల్ని పర్యవేక్షిస్తున్నారు. త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి.. గృహ ప్రవేశం చేసే అవకాశం ఉందంటున్నారు. ఎప్పటి నుంచో చంద్రబాబుకు కుప్పంలో సొంత ఇల్లు కూడా లేదని విమర్శలు వచ్చాయి.. దీంతో రెండు, మూడేళ్ల క్రితం కుప్పంలో స్థలం కొనుగోలు చేసి ఇంటి నిర్మాణం చేస్తున్నారు.