ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తాడేపల్లి నివాసం దగ్గర భద్రతకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ కొన్ని మార్పులు చేపట్టగా.. జగన్ ఇంటి దగ్గర ఉన్న హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయన భద్రతలో భాగంగా తాడేపల్లి నివాసానికి వెళ్లే రోడ్డులో ఏర్పాటు చేసిన హైడ్రాలిక్ బొలార్డ్స్, టైర్ కిల్లర్స్‌ను పూర్తిగా తొలగించారు. అలాగే జగన్ నివాసానికి పార్క్ విల్లాస్ ద్వారా వెళ్లే రోడ్డులో చెక్‌పోస్ట్‌లు ఉన్నాయి.. వాటిని కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించారు.
జగన్ తాడేపల్లి నివాసానికి వెళ్లే నాలుగు లైన్ల రోడ్డులో రాకపోకలు మరింత సులభంగా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు అధికారులు. అలాగే ఇంటికి సమీపంలో రోడ్డుపై వేసిన రెయిన్ ప్రూఫ్ టెంట్లు, ఆంధ్ర రత్న పంపింగ్ స్కీం వైపు ఉన్నటువంటి పోలీసు చెక్‌పోస్టును అధికారులు తొలగించారు. జగన్ నివాసం దగ్గర తొలగించిన సామగ్రిని లారీలో అక్కడి నుంచి తరలించారు. ఆ రోడ్డు వెంట ఉన్న కంటైనర్లు మాత్రం అలాగే వదిలేశారు. అక్కడ అవసరమైన మార్పులు, చేర్పులు చేపట్టారు అధికారులు.
ఏపీ ఎన్నికల తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాడేపల్లి నివాసం గురించి చర్చ జరిగింది. ఆయన ఇంటి చుట్టూ ఏకంగా 30 అడుగుల ఎత్తులో ఇనుప గోడను నిర్మించారు. ఈ వీడియోలు, ఫోటోలు వైరల్ అయ్యాయి.. అయితే భద్రతాపరమైన కారణాలతో ఇలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇటీవల తాడేపల్లి నివాసం దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీని కూడా పెంచుకున్నారు. గతంలో జగన్ నివాసం ఉన్న తాడేపల్లి రోడ్డులోకి వాహనాలను, సామాన్యుల్ని అనుమతించేవాళ్లు కాదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డులోకి సామాన్యుల్ని కూడా అనుమతిస్తున్నారు.. ఇప్పుడు వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
ప్రభుత్వ నిర్ణయంతో మంగళగిరి - తాడేపల్లి ప్రజలకు నాలుగు లైన్ల రోడ్డు అందుబాటులోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆ రోడ్డులో ఆంక్షలు అమలు చేశారు.. దీంతో స్థానికులు అటువైపుగా వెళ్లేవారు కాదు. తాజాగా ఈ రోడ్డులోకి అనుమతి ఇవ్వడంతో.. ఇప్పుడు సామాన్య ప్రజలు, సమీపంలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు, పొలాలకు వెళ్లే రైతులు, రైతు కూలీలకు రోడ్డు అందుబాటులోకి వచ్చింది.