ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సర్కార్ అంతర్జాతీయ నిపుణుల్ని రంగంలోకి దించింది. అమెరికా, కెనడా నుంచి వచ్చిన నిపుణుల టీమ్ పోలవరం ప్రాజెక్టు పరిస్థితిపై వరుసగా సమీక్ష చేస్తున్నారు. అంతర్జాతీయ నిపుణులు డివిడ్ బి.పాల్, రిచర్డ్ డోన్నెల్లీ, గియాస్ ఫ్రాంకో డి సిస్కో, సీస్ హించ్‌బెర్గర్‌లు ప్రాజెక్ట్ పరిస్థితిపై అధ్యయనం చేస్తున్నారు. కేంద్ర జలసంఘం నిపుణులు, ఇతర ప్రతినిధులు ఇచ్చే సమాధానాలు వింటూ.. విదేశీ నిపుణులు వారి అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. ఈ టీమ్ ప్రాజెక్ట్ డయాఫ్రం వాల్ గురించి వారు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రధానంగా వరద నీరు ప్రవహంచినంత మాత్రాన పోలవరం ప్రాజెక్టులో నిర్మించిన డయాఫ్రం వాల్‌కు ఏమీ కాదని వ్యాఖ్యానించారు. కొంతకాలం నీళ్లలో ఉంటే దెబ్బతింటుందనే వాదన, ఆలోచన సరికాదని అన్నారు.ఒక డయాఫ్రం వాల్‌కు మరో కొత్త కట్టడాన్ని అనుసంధానించినంత మాత్రాన.. ఈ రెండిటికి సమన్వయం సాధ్యం కాదన్న ఆలోచనను కూడా అంతర్జాతీయ నిపుణుల టీమ్ తోసిపుచ్చిందట. ఈ మేరకు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్ గోదావరి వరదలతో ధ్వంసమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొత్త డయాఫ్రం వాల్ నిర్మాణం చేయాలా.. ప్రస్తుతం ఉన్న దానికే మరమ్మత్తులు చేయాలా అన్న అంశంపై అధ్యయనం చేస్తున్నారు. అలాగే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించి.. పాత దానికి అనుసంధానించాలా అనే కోణంలో కూడా చర్చ జరుగుతోంది. ఇప్పుడున్న డయాఫ్రం వాల్‌క మరమ్మత్తులు చేసుకుంటే సరిపోతుందని ఒకరు వ్యాఖ్యానించగా.. వరద నీటిలో ఉండిపోయిన విషయాన్ని కొందరు గుర్తు చేశారు. అలాంటప్పుడు ఎలాంటి నష్టం ఉండదా అనే సందేహం వ్యక్తమైంది.
ఆ కట్టండపై నుంచి వరద ప్రవహిస్తే ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు అభిప్రాయపడ్డారట. ప్రస్తుతం ఉన్న డయాఫ్రం వాల్‌కు మరో కొత్త కట్టడంతో అనుసంధానిస్తే ఇబ్బంది ఉంటుందా అని మరికొందరు ప్రశ్నించగా.. అలాంటిది ఏమీ ఉండదని నిపుణులు చెప్పారట. ఏళ్ల క్రితం నిర్మాణం చేసిన డయాఫ్రంవాల్‌ను వెడలప్పు చేసి నిర్మించుకున్న సందర్భాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారట. ఇప్పటికే జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ డయాఫ్రం వాల్‌ను పరీక్షించి ఇచ్చిన రిపోర్ట్‌ను నిపుణుల టీమ్
తీసుకుంది. డయాఫ్రం వాల్ గ్యాప్‌లలో ఉన్న మట్టి, ఇసుకు నమూనాలు కూడా పరిశీలించారు నిపుణులు. అలాగే డయాఫ్రం వాల్ ధ్వంసమైన ప్రాంతంలో కొన్ని నమూనాలు సేకరించి పరిశీలించారు.
పోలవరం ప్రాజెక్ట్ ఎగువ కాఫర్ డ్యామ్‌ను అంతర్జాతీయ నిపుణులు పరిశీలించారు.. ఇప్పటికే చేసిన పరీక్షల నివేదికలను పరిశీలంచారు. మరికొన్ని పరీక్షలు చేయించాలని సూచించారు.. ఆ రిపోర్ట్‌లను ఇవాళ చూస్తామని తెలిపారు. వెంటనే ఈ పరీక్షల్ని కూడా ప్రారంభించారు. అంతేకాదు బంకమట్టి ఉన్న చోట నిర్మాణాలు కష్టమనే అభిప్రాయాన్ని కూడా ఈ టీమ్ తోసిపుచ్చింది. నిపుణుల టీమ్ మంగళ, బుధవారాల్లో పోలవరంలోనే సమీక్షలు కొనసాగిస్తారు. ఈ నలుగురు టీమ్ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే రిపోర్ట్ అందజేసే అవకాశం ఉందంటున్నారు.