ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఓ వ్యక్తి పడిన తాపత్రయం ఏకంగా .11 లక్షల రూపాయలు పోగొట్టుకునేలా చేసింది. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి నరసాపురంలో బస్సులో సీటు కోసం ప్రయత్నించి ఓ వ్యక్తి 11 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. గుంటూరులోని ఓ బంగారు వ్యాపారి వద్ద గుమస్తాగా పని చేసే సింగ్ అనే వ్యక్తి సోమవారం నరసాపురం వచ్చారు. నరసాపురంలోని బంగారు షాపు యజమానుల వద్ద నగల తయారీకి సంబంధించిన ఆర్డర్లు తీసుకున్నారు. అలాగే వారి నుంచి రావాల్సిన డబ్బులు వసూలు చేసుకుని ఓ బ్యాగులో సర్దుకుని తిరిగి..భీమవరం బయల్దేరారు.
అయితే భీమవరం వెళ్లేందుకు నరసాపురం బస్టాండుకు వచ్చిన సింగ్‌కు భీమవరం వెళ్లే బస్సు కనిపించింది. అప్పుడే స్టాప్ లోకి రావటంతో బస్సులో సీట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. దీంతో బస్సులో సీటు కోసం ఆశపడిన సింగ్.. తాను కూడా ఓ సీటును రిజర్వ్ చేసుకుందామనుకున్నారు. వెంటనే కిటీకీలో నుంచి తన చేతిలో ఉన్న బ్యాగును సీట్లో వేశారు. తర్వాత తీరిగ్గా బస్సు ఎక్కి సీటు వద్దకు వెళ్లిన సింగ్‌కు దిమ్మతిరిగింది. సీటులోకి వేసిన బ్యాగ్ కనిపించలేదు. దీంతో లబోదిబోమంటూ బస్సు మొత్తం వెతికారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది.
బ్యాగులో రూ.11 లక్షల నగదు, బంగారం ఉన్నట్లు సింగ్ చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.బస్టాండ్ పరిసరాల్లో గాలించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెర్లాలో ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే బస్సులో సీటు కోసం ఏకంగా 11 లక్షలు పోగొట్టుకోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అంత నగదు, బంగారాన్ని బ్యాగులో ఉంచి సీటు కోసం బస్సులోకి వేయడాన్ని స్థానికులు తప్పుబడుతున్నారు. అలాగే మరీ ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అని చర్చించుకుంటున్నారు.