ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అపారమైన అవకాశాలు, వనరులు ఉన్నాయని అబుదాబికి చెందిన ఎంఎఫ్-2 సంస్థ ప్రతినిధులకు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరించారు. మంగళగిరిలోని ఏపీఐఐసీలో ఆ సంస్థ ప్రతినిధులతో గురువారం మంత్రి సమావేశమయ్యారు. ఎంఎఫ్-2 సంస్థకు జినోమిక్స్, పర్యావరణ మెడ్‌టెక్, బయోటెక్ విభాగాల్లో అపారమైన అనుభవముంది. ఏపీలో బల్క్ డ్రగ్ పార్క్ మొదటి స్థానంలో ఉన్న విషయాన్ని, అలాగే సుమారు 170 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఏపీ మెడ్‌టెక్ జోన్, కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన మూడు ఎకనమిక్ జోన్లలో పెట్టుబడులు పెట్టేందుకు మెండుగా ఉన్న అవకాశాలను ఎంఎఫ్-2 సంస్థ ప్రతినిధులకు మంత్రి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని, సింగిల్ విండో విధానాన్ని అమలు చేస్తామని, అవసరమైన రాయితీల్ని కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఎకనమిక్ కారిడార్లు, మెడ్‌టెక్ జోన్‌లలో ఎంఎఫ్-2 ప్రతినిధులు క్షేత్రస్థాయి పర్యటన చేశాక, పలు దఫాలుగా చర్చించిన తర్వాత ఆ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్టు మంత్రి తెలిపారు.