తనకి ఉన్న 4 ప్లస్ 4 భద్రతను పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ మంత్రి అంబటి రాంబాబు దాఖలు చేసిన పిటిషన్ గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ... వ్యాజ్యం మొదటిసారి విచారణకు వచ్చిందన్నారు. వివరాలు సమర్పించేందుకు సమయం ఇవ్వాలని అభ్యర్థించారు. ఈ వివరాలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని పోలీసులను ఆదేశిస్తూ విచారణను జూలై 10కి వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీవీఎల్‌ఎన్ చక్రవర్తి గురువారం ఆదేశాలిచ్చారు.