ఆంధ్రప్రదేశ్‌లో పాలనను చక్కబెట్టేందుకు సమర్థవంతమైన అధికారులను తమ జట్టులోకి తీసుకుంటున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తనకు కావాల్సిన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రంలో, ఇతర రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్‌కు రప్పించుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి పట్టుబట్టి మరీ అధికారులను ఏపీకి తెచ్చుకుంటున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో 2014 నుంచి 2019 మధ్య సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు పేషీలో పనిచేసిన ఐఏఎస్ అధికారి ఏ.వి. రాజమౌళి.. తిరిగి ఏపీకి వచ్చారు. ఆయనకు సీఎంఓలో చంద్రబాబు.. కీలక బాధ్యతలు అప్పగించారు. దీంతో ఐఏఎస్ కృష్ణతేజను రప్పించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలించనున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఏ.వి. రాజమౌళికి ఏపీ సీఎంఓలోకి వచ్చి చేరారు. గతంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేసిన సమయంలో ఆయనకు కార్యదర్శిగా ఏవీ రాజమౌళి పనిచేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి.. ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకపోవడంతో ఏవీ రాజమౌళి డిప్యుటేషన్ ముగియడంతో తిరిగి యూపీ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను మళ్లీ తీసుకువచ్చి.. సీఎంఓలోకి తీసుకున్నారు. ఐఏఎస్ ఏవీ రాజమౌళి సోమవారం రిపోర్ట్ చేయనున్నారు. ఏవీ రాజమౌళి డిప్యుటేషన్‌కు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. వచ్చే మూడేళ్ల పాటు ఏవీ రాజమౌళి ఏపీలో పనిచేసేందుకు అనుమతి లభించింది.
2003 బ్యాచ్‌కు చెందిన ఏవీ రాజమౌళి.. గత టీడీపీ ప్రభుత్వంలో డిప్యుటేషన్‌పై పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. తాజాగా ఆయనకు సీఎంవోలోనే విధులు కల్పించారు. సీఎంలోలోకి ఏవీ రాజమౌళి రావడంతో అధికారుల సంఖ్య 4 కు పెరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా ఉన్నారు.
ఇక యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి ఏవీ రాజమౌళి తిరిగి ఏపీకి రావడంతో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోరిక కూడా నెరవేరే అవకాశాలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చినప్పటినుంచి కేరళ కేడర్‌కు చెందిన ఐఏఎస్ కృష్ణతేజను ఏపీకి రప్పించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్‌కు కూడా దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే కేరళ ప్రభుత్వం ఐఏఎస్ కృష్ణతేజను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇక సోమవారం అపాయింట్‌మెంట్స్ కమిటీ ఏపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. ఐఏఎస్ కృష్ణ తేజ బుధ, గురువారాల్లో ఏపీ ప్రభుత్వం వద్ద రిపోర్టు చేయనున్నట్లు తెలుస్తోంది.