ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ముందు చిత్తుగా ఓడిపోయిన వైసీపీ.. ఓటమి కారణాలను వెతుక్కుంటోంది. అయితే ఎవరికి వారు తమ ఓటమికి గల కారణాలను బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. కీలక వ్యాఖ్యలు చేశారు. తాను వైఎస్ జగన్ వల్లే ఓడిపోయినట్లు తాజాగా వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలోని చోడవరం నియోజకవర్గంలో తాను పరాజయం పాలు కావడానికి బీఎన్ రహదారిపై ఏర్పడిన గుంతలేనని చెప్పారు. అయితే వాటిని పూడ్చాలని తాను ఎన్నోసార్లు అప్పటి సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేశానని.. అయినా ఆయన వినకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో మీడియాతో శనివారం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చోడవరంలో తన ఓటమికి ప్రధాన కారణం బీఎన్ రహదారిపై ఉన్న గుంతలేనని చెప్పారు. అయితే బీఎన్ రహదారికి మరమ్మతులు చేయాలని.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదని తెలిపారు. దాని ఫలితంగానే చోడవరంలో భారీ ఓట్ల తేడాతో తాను దారుణంగా ఓడిపోయినట్లు వాపోయారు. ఆ బీఎన్ రహదారి కోసం తాను సొంతంగా రూ.2 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి చేసినట్లు తెలిపారు. అయినా తనను ఓటర్లు అంగీకరించలేదని వివరించారు. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆ డబ్బులను తిరిగి తనకు ఇస్తుందో లేదో కూడా తెలియదని కరణం ధర్మశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
2019 నుంచి 2014 వరకు గత 5 ఏళ్లలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనలో కొన్ని తప్పులు జరిగాయని కరణం ధర్మశ్రీ తాజాగా అంగీకరించారు. అయితే వాటిని గుర్తించి సరిదిద్దుకోవడంలో విఫలం కావడం వల్లే ఆంధ్రప్రదేశ్ ప్రజలు.. వైసీపీని తిరస్కరించారని పేర్కొన్నారు. తప్పులకు పరిష్కారం వెతకకపోవడంతోనే ఎన్నికల్లో ఓటర్లు తమకు ఓటు వేయాలేదని చెప్పారు. పరిపాలనలో, వ్యవస్థాగత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాల కారణంగానే ఓడిపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు తెలిసో.. తెలియకో చేసిన తప్పుల కారణంగా ప్రజలు తమను అధికారం నుంచి దించేశారని వెల్లడించారు. ఈ విషయాన్ని తామంతా అంగీకరించామని చెప్పిన కరణం ధర్మశ్రీ.. ప్రస్తుతం అవే తప్పులు చేసి మీరూ కూడా అలాంటి ప్రజా తీర్పే కోరుకుంటారా అని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మంత్రులు గానీ, ఎమ్మెల్యేలు గానీ నియోజకవర్గంలో తిరిగితే.. వైసీపీకి చెందిన సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు వారికి స్వాగతం పలికి ఆయా కార్యక్రమాల్లో పాల్గొనాలని కరణం ధర్మశ్రీ సూచించారు. ఒకవేళ.. ఆ కార్యక్రమాలకు ఆహ్వానం ఇవ్వకపోతే వెళ్లడం, వెళ్లకపోవడం వారి ఇష్టం అని చెప్పారు.