ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇలా కీలక శాఖలకు మంత్రిగా ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇక మంత్రిత్వ శాఖల నిర్వహణలోనూ డిప్యూటీ సీఎం తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఓ కొత్త కార్యక్రమం నిర్వహించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందుకు తన సొంత నియోజకవర్గమైన పిఠాపురాన్ని వేదికగా ఎంచుకున్నారు. వినాయక చవితి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో వచ్చే వినాయక చవితిని అందరూ పర్యావరణ హితంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
పర్యావరణ హితంగా పండుగను జరుపుకునేలా.. వినాయకచవితికి అందరూ మట్టి వినాయకులనే పూజించేలా అవగాహన కల్పించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఇందుకోసం మట్టి గణేశుడి విగ్రహాల వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను డిప్యూటీ సీఎం ఆదేశించారు. అలాగే తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో మట్టి వినాయకుడి విగ్రహాలతో పూజలు జరిపేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. వీటితో పాటుగా... ప్లాస్టిక్ వస్తువుల వినియోగం తగ్గించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు డిప్యూటీ సీఎం సూచించారు.
వినాయకచవితికి మట్టి గణపతిని పూజిస్తే పర్యావరణానికి మేలు కలుగుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. అలాగే ఆలయాల్లో ప్రసాదాల పంపిణీకి ప్లాస్టిక్ కవర్లు కాకుండా తాటాకు బుట్టలు, ఆకుల దొన్నెలను ఉపయోగించాలని సూచించారు. ఈ తరహా ప్రయోగం పిఠాపురం ఆలయాల్లోనే ప్రయోగాత్మకంగా చేపడతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. మరోవైపు అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు. శాస్త్రీయ విధానాలను అనుసరించి వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలని పవన్ ఇటీవల అధికారులకు సూచించారు.
ఘన, ద్రవ వ్యర్థాల విషయంలో సృజనాత్మకంగా ఆలోచించి వాటిని పునర్వినియోగం చేస్తే పారిశుద్ధ్య సమస్యను అధిగమిచవచ్చని పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన సమావేశంలో అధికారులకు నిర్దేశం చేశారు. అలాగే పిఠాపురం, భీమవరం నియోజకవర్గంలో వ్యర్థాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలంటూ కాకినాడ జిల్లా పర్యటనలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత రాష్ట్రమంతా ప్రతి నియోజకవర్గంలో వ్యర్ధాల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ నిర్ణయించారు.