మాజీ మంత్రి, వైసీపీ లీడర్ కొడాలి నానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. ఓ కేసులో పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొడాలి నానికి 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని.. విచారణలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పాటించాలని హైకోర్ట పోలీసులను ఆదేశించింది. అసలు విషయంలోకి వస్తే కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ కొంతమంది వాలంటీర్లు ఆయనపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేయగా.. కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని ఆదేశించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు.. ఆయనను అరెస్ట్ చేయవద్దని ఆదేశించింది. అలాగే ఆయనకు 41ఏ నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని స్పష్టం చేసింది.2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన పలువురు వాలంటీర్లు.. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమను తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ రోడ్డెక్కారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పడం సహా పదివేల గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ప్రచారం సమయంలో చంద్రబాబు ప్రకటించారు. దీంతో ఎన్నికల సమయంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లు.. టీడీపీ అధికారంలోకి రావటంతో తిరిగి తమను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే కొన్నిచోట్ల వైసీపీ నేతల బలవంతంతోనే తాము రాజీనామా చేయాల్సి వచ్చిందంటూ వాలంటీర్లు పోలీస్ స్టేషన్లను ఆశ్రయించారు. వైసీపీ నేతలపై ఫిర్యాదులు చేశారు.
ఈ క్రమంలోనే కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ గుడివాడలో కొంతమంది మాజీ వాలంటీర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు ఆధారంగా మాజీ ఎమ్మెల్యే కొడాలి నానితో పాటు ఆయన సహచరుడు దుక్కిపాటి శశిభూషణ్, గుడివాడ వైసీపీ అధ్యక్షుడు గొర్ల శ్రీను సహా మరికొందరిపై గుడివాడ పోలీసులు కేసులు నమోదు చేశారు. దీంతో వీరిని పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశించాలంటూ వైసీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా.. కోర్డు తీర్పు కొడాలి నానికి ఊరట నిచ్చింది.
వాలంటీర్ల రాజీనామాల వ్యవహారంలో కొడాలి నానిని అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలంటూ పిటిషనర్ల తరఫు వాదనతో ఏకీభవించిన హైకోర్టు.. కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దంటూ ఆదేశించింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారించాలని స్పష్టం చేసింది. దీంతో ఇప్పటికిప్పుడు అరెస్ట్ కాకుండా కొడాలికి రిలీఫ్ లభించింది.