అందరిలోను, అన్నింటా దైవాన్ని చూసిన మహనీయుడు మలయాళ స్వామి అని వ్యాసాశ్రమ పీఠాధిపతి శ్రీపరిపూర్ణానందగిరి తెలిపారు. వేదాలు, ఆధ్యాత్మిక శాస్త్రాలు నిర్దిష్ట వర్గానికి మాత్రమే అన్న అపోహను తొలగించి అన్ని వర్ణాల వారికి సంస్కృతం నేర్పించి అందరికీ దైవజ్ఞానాన్ని అందించిన ఘనత మలయాళ స్వామికి దక్కుతుందన్నారు. ఆయన ఏర్పాటుచేసిన వ్యాసాశ్రమం పీఠాధిపతిగా దేశమంతా సంచరిస్తున్నానని వివరించారు. అమలాపురం విద్యుత్ నగర్‌లోని ఆదిశేషా నిలయంలో జరుగుతున్న వారాహి నవరాత్రి పూజా మహోత్సవాల్లో పాల్గొనేందుకు ఆదివారం వచ్చిన ఆయన వ్యాసాశ్రమం విశిష్టతను, సన్యాశ్రమ విధివిధానాలను వివరించారు. భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. కార్యక్రమంలో శ్రీగౌతమహర్షి అక్షయపాత్ర ప్రతినిధులు పోతురాజు రామకృష్ణ-నాగకనకదుర్గ, చాగంటి ప్రసాద్-నాగకనకదుర్గ (నందు), తూముదొరబాబు, పరసా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.