రాజధాని అమరావతి వాసులకు మరో గుడ్ న్యూస్. ఇకపై బెంగళూరుకు ప్రయాణం మరింత సౌకర్యవంతం కానుంది. విజయవాడ నుంచి బెంగళూరుకు ప్రతి రోజూ విమాన సర్వీసు నడవనుంది. విజయవాడ- బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డైలీ ఫ్లైట్ నడపనుంది. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విజయవాడ- బెంగళూరు మధ్య విమాన సర్వీసులు ఝమ్మని తిరగనున్నాయి. టికెట్ ధరలు కూడా ఎకానమీ క్లాసులో రూ.5 వేల వరకూ ఉంది. మరోవైపు ప్రతిరోజూ సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు బెంగళూరులో బయల్దేరనున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ IX 2516 విమానం.. 5 గంటల 40 నిమిషాలకు విజయవాడ చేరుకోనుంది. అలాగే విజయవాడ నుంచి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు బయల్దేరి రాత్రి 7 గంటల 50 నిమిషాలకు బెంగళూరు చేరుకుంటుంది. మొత్తంగా విజయవాడ- బెంగళూరు మధ్యలో కేవలం గంటా 40 నిమిషాల్లో ప్రయాణించవచ్చు.మరోవైపు ఇటీవలే విజయవాడ నుంచి ముంబైకి ఎయిరిండియా విమానం డైలీ సర్వీస్ ప్రారంభమైంది. జూన్15వ తేదీ ఈ సర్వీసును ప్రారంభించారు. రోజూ సాయంత్రం మంబైలో బయల్దేరనున్న విమానం.. సాయంత్రం 5.45 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. ఆ తర్వాత తిరిగి రాత్రి 7.10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి.. రెండు గంటల్లో ముంబై చేరుకుంటుంది. ఈ విమానంలో ప్రారంభ ధరను రూ.5,600గా నిర్ణయించారు. ఇప్పుడు విజయవాడ నుంచి బెంగళూరుకు కూడా రోజువారీ సర్వీసులు ప్రారంభం కానుండటంతో అమరావతి వాసులకు సౌకర్యవంతంగా మారనుంది.
మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రాజధాని అమరావతి ప్రాధాన్యం పెరిగింది. ఏ ఫర్ అమరావతి, బీ ఫర్ పోలవరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం ప్రాధాన్యాలను ప్రజలకు ఇప్పటికే వెల్లడించారు. ఇదే క్రమంలో అమరావతికి కేంద్ర సంస్థలను రప్పించేందుకు సీఆర్డీఏ ప్రయత్నాలు సైతం ప్రారంభించింది. ఇప్పటికే పలు కేంద్ర సంస్థలు సైతం అమరావతిలో కార్యాలయాల ఏర్పాటుకు ఆసక్తి చూపినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అమరావతిలో భూములు పొందిన సంస్థలు.. తమకు కేటాయించిన స్థలాలలో జంగిల్ క్లియరెన్స్ చేయాలని సీఆర్డీఏ అధికారులను కోరినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో అమరావతికి సంస్థలు తరలివచ్చే అవకాశం ఉంది. అలాగే విజయవాడ నుంచి రాకపోకలు సైతం పెరిగే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే విజయవాడ నుంచి ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలకు డైలీ సర్వీసులు ప్రారంభం కావటం విశేషం.