ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మంగళవారం పిడుగులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తరకోస్తా తీరం మీదుగా విస్తరించిన ఆవర్తనం ప్రభావంతో.. రేపు, ఎల్లుండి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తనం ప్రభావంతో.. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, సత్యసాయి జిల్లా, వైయస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు , కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో కూడా అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.
పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో.. పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. చెట్ల కింద ఉండరాదని ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు. మరోవైపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది.
మరోపైపు ఆవర్తనం ప్రభావంతో దక్షిణ కోస్తా ప్రాంతంలో మంగళ, బుధవారాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది. ఉత్తర కోస్తా జిల్లాలలో ఒకటీ లేదా రెండుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇక రాయలసీమలో కూడా రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఏపీలో వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు కురవడం లేదని రైతులు దిగాలుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీలో వచ్చే రెండు, మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి.