రాష్ట్రం విడిపోయి పదేళ్లు అయ్యిందని, విభజన అనంతరం ఏపీలో అనేక సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని అంబటి రాంబాబు అన్నారు. దాని వల్ల మనకు తీవ్రంగా నష్టం జరుగుతోందని అనేకసార్లు చంద్రబాబు కూడా వ్యాఖ్యానించారన్నారు. విభజన అనంతరం ఏపీకి చంద్రబాబు సీఎం అయి, 5 సంవత్సరాలు పాలించారన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండే వెసులుబాటును విభజన చట్టంలో పొందుపరిచినా… ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. చంద్రబాబు ఎందుకు ఏపీకి పారిపోయి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేసారు. బస్సులో ఉండి పరిపాలన చేయాల్సిన దుస్థితి ఎందుకు ఏర్పడిందో కూడా సమాధానం చెప్పాలన్నారు. ఓటుకు కోట్లు కేసులో తప్పుచేయడంతో బాబును మెడపట్టి గెంటేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నుంచి భయపడి పారిపోయి వచ్చి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని ద్రోహం చేశారని చంద్రబాబుపై అంబటి ధ్వజమెత్తారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాద్ను వదిలి, 9, 10వ షెడ్యూల్ లో ఉన్న, విభజన చట్టంలో ఉన్న ఆస్తులు పంపకం చేసుకోకుండా, బేరసారాలు ఆడకుండా, చర్చలు జరపకుండా పారిపోయి వచ్చి నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు ప్రథమ ద్రోహం చేసిన వ్యక్తి అవునా? కాదా? ఆలోచన చేయాలన్నారు. ఐదేళ్లు పరిపాలన చేసి ఏం చంద్రబాబు ఏం సాధించారన్నారు. హైదరాబాద్లో అన్ని ఆఫీసులు ఖాళీ చేసి, జీ హుజూర్ అని సలాం పెట్టి వచ్చేసి ఇక్కడ తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు కట్టారని, పదేళ్లు సమయం ఉంటే ఎందుకు తాత్కాలికంగా కట్టాలని అంబటి ప్రశ్నించారు. వెళ్లకపోతే ఊరుకోం, మిమ్మల్ని కేసులో పెట్టేస్తాం అని వాళ్లు అంటే తప్పు చేసి, భయపడి ఏపీకి అన్యాయం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు అని తేల్చి చెప్పారు.ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యి మరొక అన్యాయం చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారని ఆంబటి మండిపడ్డారు.