సీఎం చంద్రబాబుతో త్వరలో జరగనున్న సమీక్షా సమావేశంలో ఆలయాల ప్రగతికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్టు దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఇంద్ర కీలాద్రిపై దుర్గమ్మ, మల్లేశ్వరస్వామిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల స్థితిగతులు, అభివృద్ధి పనులను గురించి రెండురోజుల క్రితం చర్చించామన్నారు. దీనిలో భాగంగా దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో అభివృద్ధి పనులు, చేపట్టాల్సిన పనులను గురించి ఈవో రామారావు, ఇంజనీరింగ్ అధికారులు, అర్చకులు వివరించారన్నారు. పనుల్లో ఎక్కడా నాణ్యతాలోపం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆలయంలో అభివృద్ధి పనులపై త్వరలో జరగనున్న సీఎం సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకుంటామన్నారు. పాలకవర్గాల విషయంలో కూడా ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి పాలకవర్గం, అధికారులు, దేవస్థానం సిబ్బంది అందరూ సహకరించాలని కోరారు. తొలుత మంత్రికి ఈవో కేఎస్ రామారావు, అర్చక బృందం ఆలయ మర్యాదలతో సాదర స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదం తదితరాలు అందజేశారు.