కమిషన్లకు కక్కుర్తి పడిన చంద్రబాబు, ప్రొటోకాల్ పాటించకుండా పోలవరం ప్రాజెక్టు పనులు చేయడం వల్లనే, ఈరోజు అన్ని అనర్ధాలకు కారణం అని పేర్ని నాని స్పష్టం చేశారు. ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించకుండా, వారికి పునరావాసం కల్పించకుండా కాఫర్ డ్యామ్ ఎలా నిర్మించారని సూటిగా ప్రశ్నించారు. డైవర్షన్ ఛానల్ ఇవ్వలేదని, స్పిల్ వే పూర్తి కాకుండానే, అప్పర్ కాఫర్ డ్యామ్, డయాఫ్రం వాల్, లోయర్ కాఫర్ డ్యామ్ పనులన్నీ మొదలు పెట్టారన్నారు. దీంతో పనులన్నీ అస్తవ్యస్తమయ్యాయని, ఫలితంగా భారీ వరదలకు డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని చెప్పారు. కొత్తగా డయాఫ్రమ్ వాల్‌కు దాదాపు రూ.1200 కోట్లు ఖర్చవుతందని అంచనా కాగా.. ఆ నిధులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని తెలిపారు. ఇలా మొత్తంగా పోలవరం ప్రాజెక్టు పనుల నాశనానికి చంద్రబాబే పూర్తి బాధ్యుడని తేల్చి చెప్పారు.మరోవైపు పోలవరం ప్రాజెక్టు పనుల్లో తాము 72 శాతం పనులు పూర్తి చేశామని చంద్రబాబు చెప్పుకుంటున్నారన్న శ్రీ పేర్ని నాని.. అదే నిజమైతే.. మిగిలిన 28 శాతం పనులు ఎప్పుడు పూర్తి చేస్తారనేది ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు. నిజానికి పోలవరం ప్రాజెక్టులో ముఖ్యమైన డ్యామ్, స్పిల్ వే, నీటి డైవర్షన్, కాఫర్ డ్యామ్ పనులు తామే పూర్తి చేశామని శ్రీ పేర్ని నాని వెల్లడించారు.