ఏపీలో తల్లికి వందనం పథకంపై కూటమి సర్కార్ తీరును వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా తప్పుపట్టింది. తల్లికి రూ.15వేలు మాత్రమే అనిచెప్పి, బీపీఎల్ కుటుంబాలకు వర్తిస్తుందని చెప్పి, 75శాతం హాజరు తప్పకుండా ఉండాలని షరతు కూడాపెట్టి జీవో విడుదల చేస్తే, మళ్లీ మార్గదర్శకాలు అంటూ ఈ పిల్లిమొగ్గలు ఎందుకు. ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పినట్టుగా బడికి వెళ్లే ప్రతి విద్యార్థికీ ఇస్తామని నేరుగా విద్యాశాఖమంత్రే మీడియా ముందుకు వచ్చి చెప్పొచ్చుగా. అలా చెప్పలేదంటే అర్థం.. మోసం చేస్తున్నట్టే కదా? చీటికిమాటికీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీద విరుచుకుపడే సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, టీడీపీ నాయకులు … తల్లికి వందనం జీవోపై మాట్లాడకుండా ఈ డొంకతిరుగుడు ఎందుకు? అంతేకాక టీడీపీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో ఇంగ్లీష్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని కూడా చెప్పారు. మళ్లీ ఇప్పుడు ఈ కొత్త వాదన ఏంటి? అని వైయస్ఆర్‌సీపీ ప్రశ్నించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేసింది.