ఏపీ రాజకీయాలపైనా, అక్కడి రాజకీయ పరిస్థితులపైనా బీఆర్ఎస్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మాజీ ఎంపీ, ప్రస్తుతం ఉండి ఎమ్మెల్యేగా ఉన్న రఘురామకృష్ణరాజును వేధించారనే ఆరోపణలపై మాజీ సీఎం వైఎస్ జగన్, సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు పీవీ సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ వార్తలు తనకు షాక్ గురిచేశాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు. డీజీపీ ర్యాంకులో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు, మాజీ సీఎం మీద ఎఫ్ఐర్ నమోదైందన్న వార్తలు తనను షాక్‌కు గురిచేశాయని అందులో పేర్కొన్నారు. ఈ అంశాన్ని అప్పట్లోనే కోర్టులు విచారించాయని.. అయితే అందులో ఏమీ బయటకు రాలేదని అభిప్రాయపడ్డారు.
అధికారం మారడం తప్ప మూడేళ్లలో ఏం మారిందని.. మూడేళ్ల తర్వాత అకస్మాత్తుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి వచ్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.దురదృష్టవశాత్తూ నిజాయితీగల పోలీసులు ఈ దేశంలో ప్రతీకార రాజకీయాల్లో బాధితులుగా మారుతున్నారని ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. గోద్రా మారణహోమంలో సత్యం, న్యాయానికి అండగా నిలిచినందుకు గుజరాత్ కేడర్‌కు చెందిన ఐపీఎస్ సంజీవ్ భట్ ఏళ్ల తరబడి జైల్లో మగ్గుతున్నారని చెప్పుకొచ్చారు. మరోవైపు రఘురామకృష్ణరాజుపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇదే రాజకీయ నాయకుడు, 2021లో పార్లమెంటులో తనపై నిరాధార ఆరోపణలు చేశారని గుర్తుచేశారు. ఆయన ఎలా మళ్లీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారనేదీ ఆశ్చర్యంగా ఉందన్నారు.
ఆంధ్రప్రదేశ్ సహా ఇతర చోట్ల సీనియర్ పోలీస్ అధికారులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా నమోదు చేసిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఓ కేసులో తనను కస్టడీకి తీసుకుని కొట్టారని.. హత్యాయత్నం చేశారంటూ రఘురామకృష్ణరాజు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘురామ ఫిర్యాదుతో మాజీ సీఎం వైఎస్ జగన్, ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ సీతారామాంజనేయులు, సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్ సహా మరికొందరు పోలీసులపై గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.