ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రతి శనివారం.. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని సందర్శిస్తున్న సీఎం చంద్రబాబు.. ఈ శనివారం కూడా అదే పద్ధతి ఫాలో అయ్యారు. శనివారం పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు.. పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారితో చర్చించిన చంద్రబాబు.. కీలక సూచనలు చేశారు. అధికార పగ్గాలు చేపట్టాం కదా అనే అలసత్వాన్ని దరి చేరనీయవద్దని నేతలకు, కార్యకర్తలకు చంద్రబాబు సూచించారు. మంత్రులు కూడా ప్రతిరోజూ పార్టీ కార్యాలయానికి రావాలని ఆదేశించారు. పార్టీ ఆఫీసుకు రావడాన్ని ఒక సేవగా భావించాలన్న చంద్రబాబు.. కనీసం ఇద్దరు మంత్రులైనా రోజూ కార్యాలయానికి వచ్చి అందుబాటులో ఉండాలన్నారు.
మరోవైపు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ నేతలు ఎవరూ కూడా కక్షసాధింపు చర్యలకు దిగకూడదని సూచించారు. వ్యక్తిగత దాడులు, కక్షసాధింపులు తగవన్న చంద్రబాబు.. అలా చేస్తే వైసీపీకి, మనకూ తేడాం ఏం ఉంటుందని ప్రశ్నించారు. తప్పు చేసిన వారిని చట్టం శిక్షిస్తుందన్న ఆయన.. వ్యక్తిగత దాడులు, కక్షసాధింపు చర్యలు తగవని మరోసారి నేతలకు స్పష్టం చేశారు. కార్యాలయంలో ప్రతిరోజు ఇద్దరు మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని.. కార్యకర్తలు, ప్రజల నుంచి వచ్చే వినతుల స్వీకరణకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేద్దామని చంద్రబాబు అన్నారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబ.. ప్రజల నుంచి వచ్చే వినతులు, విజ్ఞప్తుల పరిష్కారానికి మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.
ఇక ఈ సమావేశంలోనే నామినేటెడ్ పదవుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపైనా తెలుగు తమ్ముళ్లకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి వారికి నామినేటెడ్ పదవులు దక్కుతాయన్న చంద్రబాబు.. వివరాల సేకరణ కోసం ఐదు విధానాలను అనుసరిస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ఇంఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ సమన్వయకర్తలు, నియోజకవర్గ పరిశీలకులతో పాటుగా ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. నివేదికలు రాగానే నామినేటెడ్ పదవుల భర్తీపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచార సేకరణ అని అధినేత స్వయంగా చెప్పడంతో టీడీపీ శ్రేణుల్లో మరోసారి ఐవీఆర్ఎస్ అంశం ప్రస్తావనకు వస్తోంది.
మరోవైపు వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తల మీద నమోదైన అక్రమ కేసుల గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. చట్టప్రకారం వారికి ఎలా విముక్తి కలిగించాలనే దానిపై చర్చించారు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలపైన నమోదైన అక్రమ కేసుల వివరాలను పంపాలని నేతలను ఆదేశించారు.