ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ నేతలకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వీడాలని.. ఆ పద్దతి సరికాదన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు వీడియోతో చిట్ చాట్‌గా మాట్లాడారు. ఇకపై ఎవరైనా తన కాళ్లకు దండంపెడితే.. తాను వారి కాళ్లకు దండం పెడతానన్నారు. నేటి నుంచి తన కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్ పెడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
ఎవరైనా సరే తల్లిదండ్రులు, భగవంతుడి కాళ్లకు దండం పెట్టాలని.. కానీ రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టి ఎవరూ తమ గౌరవాన్ని తగ్గించుకోవద్దని హితవు పలికారు చంద్రబాబు. రాజకీయ నేతల కాళ్లకు ప్రజలు, పార్టీ శ్రేణులు దండం పెట్టొద్దనే సంస్కృతి తన నుంచే ప్రారంభిస్తున్నానన్నారు చంద్రబాబు. టీడీపీ నేతలంతా ఈ విధానానికి పుల్‌స్టాప్ పెట్టాలని సూచించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు.
కొలనుకొండ హరేకృష్ణ గోకుల క్షేత్రంలో అనంత శేషస్థాపన కార్యక్రమంలో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రంలో జరిగిన అనంత శేషస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబుకు ఆలయ మర్యాదలతో ఏపీ సీఎంకు వేద పండితులు ఘన స్వాగతం లికారు. లోక కళ్యాణార్ధం పూర్ణాహుతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
ప్రజలకు, సమాజానికి మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. మంచి చేసే వారంతా ఏపీలో ముందకు రావాలని.. మంచి చేయాలనుకునేవారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవన్నారు. అక్షయపాత్ర స్ఫూర్తితో అతి త్వరలో అన్న క్యాంటీన్లను పునఃప్రారంభిస్తామని తెలిపారు. అక్షయపాత్ర ద్వారా ప్రతిరోజు 22 లక్షల మందికి భోజనం పెడుతున్నారని గుర్తు చేశారు.. అన్న క్యాంటీన్లను చిన్న ఫిర్యాదు లేకుండా అక్షయపాత్ర నిర్వహించిందని గుర్తు చేశారు.
ఎన్టీఆర్ తిరుపతిలో అన్నదానం ప్రారంభించారని.. గతంలో రాష్ట్రవ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లు నిర్వహించామని గుర్తు చేశారు చంద్రబాబు. కానీ గడిచిన ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసిందని.. త్వరలోనే అన్న క్యాంటీన్లు పున:ప్రారంభిస్తామన్నారు. దాతలకు దేశంలో కొదవలేదు.. నమ్మకం అనే వ్యవస్థ ఉండాలన్నారు. అక్షయపాత్ర ఆధునిక వసతులతో కిచెన్ ను నడిపిస్తోందని.. ప్రజల నమ్మకం, భగవంతుడు ఆశీస్సులు హరేకృష్ణ గోకులం వారికి తప్పకుండా ఉంటాయన్నారు. పెనుకొండలో లక్ష్మీనరసింహా స్వామి 108 అడుగుల విగ్రహాన్ని ఏకశిలా రూపంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చారని.. దానికి కూడా గత ప్రభుత్వం అడ్డుపడిందన్నారు. హరేకృష్ణ గోకులం, ఇస్కాన్ కు మా ప్రభుత్వం పూర్తిగా అండగా ఉండి, సహకరిస్తుందన్నారు.
హరేకృష్ణ సంస్థ దైవసేవతో పాటు మానవ సేవను సమానంగా చేస్తోందని ప్రశంసించారు. ఆధ్యాత్మికత ద్వారా వచ్చే మానసిక ఆనందం లేకపోతే ముందుకెళ్లలేమని వ్యాఖ్యానించారు. అక్షయ పాత్ర అంతర్జాతీయ అధ్యక్షుడు మధుపండిత్ దైవత్వాన్ని అందరిలో పెంపొందించేలా ఎంతో కృషి చేస్తున్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఏకంగా 50 మంది ఐఐటీ పట్టభద్రులు సేవా కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో అభినందనీయం అన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే ఆధ్యాత్మిక సేవలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలన్నారు.
తాను కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దయతోనే.. అలిపిరిలో జరిగిన బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానన్నారు చంద్రబాబు. తెలుగు ప్రజలకు మంచి చేయడానికి, సేవలందించేందుకు ఆ దేవుడు తనకు ప్రాణభిక్ష పెట్టారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌లో, దేశంలో పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలనేది తన లక్ష్యమన్నారు. మరోవైపు హరేకృష్ణ సంస్థకు అన్నదానానికి దాతలు రూ.3 కోట్లు విరాళాన్ని ప్రకటించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త పెనుమత్స శ్రీనివాస్‌రాజు రూ.కోటి, సక్కు గ్రూపు రూ.కోటి విరాళం, యలమంచిలి కృష్ణమోహన్ గ్రూపు రూ.కోటి విరాళం అందించారు. వీరి ముగ్గుర్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు.