తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లేవారికి ముఖ్య గమనిక. జులై 16వ తేదీన తిరుమలలో బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. జులై 16న తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో జూలై 16వ తేదీన బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. ఈ కారణంగా జూలై 15వ తేదీ సిఫారసు లేఖలు స్వీకరించమని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు సాలకట్ల ఆణివార ఆస్థానాన్ని పురస్కరించుకుని జులై 9వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. ఆస్థానం నిర్వహించడానికి ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తుంటారు. అప్పుడు కూడా బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. తాజాగా జులై 16న ఆస్థానం నిర్వహిస్తూ ఉండటంతో ఆ రోజు కూడా బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ సూచించింది.
తిరుమలలో భక్తుల రద్దీ
మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి సుమారుగా 30 గంటల సమయం పడుతోంది. రెండో శనివారం, ఆదివారం వరుసగా సెలవు రోజులు రావటంతో తిరుమల కొండ నిండిపోయింది. దీంతో ఉచిత సర్వదర్శనం టైమ్ స్లాట్ లేని భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు నిండిపోయాయి. ఆక్టోపస్ భవనం వరకూ సుమారుగా 3 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. ఇక క్యూలైన్లలోని భక్తులకు టీటీడీ సిబ్బంది తాగునీరు, అన్నప్రసాదాలు అందించారు. ఎప్పటికప్పుడు క్యూలైన్లను పర్యవేక్షిస్తూ భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ఘనంగా కళ్యాణ వెంకటేశ్వరుడి పార్వేట ఉత్సవం
మరోవైపు శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడి పార్వేట ఉత్సవం ఘనంగా జరిగింది. శ్రీవారి మెట్టు సమీపంలో శనివారం పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఉత్సవమూర్తులు శ్రీవారిమెట్టు సమీపంలోని పార్వేట మండపానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు పార్వేట ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవం పూర్తైన తర్వాత సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. కళ్యాణ వెంకటేశ్వరుడి పార్వేట ఉత్సవం సందర్భంగా భజనలు,కోలాటాలు, భక్తి కీర్తనలు ఆకట్టుకున్నాయి. ఉత్సవంలో పాల్గొన్న భక్తులను అన్నప్రసాదాలు పంపిణీ చేశారు.