ఆణివార ఆస్థానం సందర్భంగా మంగళవారం సాయంత్రం తిరుమలలో పుష్పపల్లకి సేవ కన్నులపండువగా జరిగింది. వివిధ రకాల పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు.ఆరురకాల సంప్రదాయ పుష్పాలు, ఆరు రకాల స్వదేశీ, విదేశీ కట్‌ఫ్లవర్స్‌తో కలిసి మొత్తం టన్ను బరువు కలిగిన పుష్పాలను స్వామివారి పల్లకి అలంకరణకు వినియోగించారు. కృత, త్రేతా, ద్వాపర యుగాలకు చెందిన వివిధ దేవతామూర్తుల ప్రతిమలను పల్లకీకి ఏర్పాటు చేశారు.కాగా తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం నుంచి శ్రీవారికి పట్టువస్ర్తాలను సమర్పించారు. ముందుగా బేడి ఆంజనేయస్వామి ఆలయం పక్కనే ఉన్న పెద్దజీయర్ మఠంలో శ్రీవారిసారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి తమిళనాడు దేవదాయ శాఖ మంత్రి శేఖర్‌బాబు, పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీఈ జేఈవో వీరబ్రహ్మం కలిసి పట్టువస్ర్తాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారికి సమర్పించారు.కాగా సారెను ఆలయంలోకి తీసుకెళ్లే సమయంలో మహద్వారం వద్ద గందరగోళ పరిస్థితి నెలకొంది. తొలుత సారెతో పాటు పదిమందికి అనుమతి ఇచ్చారు. ఈక్రమంలో శ్రీవారి ఆలయ జీయర్‌స్వామి,మంత్రి శేఖర్‌బాబుతో పాటు పదిమంది మహద్వారం గేటులోకి ప్రవేశించగానే భద్రతాసిబ్బంది గేటు మూసివేశారు. దీంతో దేవాదాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమార గురుబాలన్ దంపతులు ఆలయం వెలుపలే ఉండిపోవాల్సి వచ్చింది.మంత్రి శేఖర్‌బాబు గుర్తించి తిరిగి గేటు వద్దకు చేరుకుని ఆలయంలోకి అనుమతించాలని విన్నవించారు. అనంతరం కుమార గురుబాలన్‌ను మహద్వారం నుంచి అనుమతించి ఆయన సతీమణిని బయోమెట్రిక్ నుంచి అనుమతించారు. శ్రీరంగ నుంచి వచ్చిన వారిలో ఇద్దరు ముందుగా మహద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లడంతో సమస్య తలెత్తినట్టు అధికారులు గుర్తించారు.