నడిరోడ్డుపైన పోలీసులు ఉండగానే వినుకొండలో రషీద్‌ను అత్యంత దారుణంగా చంపడం దుర్మార్గపు చర్య అని ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ అన్నారు. అయన మాట్లాడుతూ.... గతంలో జిల్లా ఎస్పీగా మల్లికాగార్గ్, నెల రోజులపాటు పని చేసినప్పుడు, ఈ తరహా దాడులు కాస్త తగ్గాయి. జిల్లాకు చెందిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు, సీఎం చంద్రబాబును కలిసి, ఎస్పీని మార్చమని కోరారు. ఆయన వెంటనే ఆ పని చేశారు. ఇప్పుడు వినుకొండలో మా పార్టీ కార్యకర్తను దారుణంగా హత్య చేశారు. ఘటన జరిగిన వెంటనే, ఎలాంటి దర్యాప్తు చేయకుండానే, అర్ధరాత్రి మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ, అది వ్యక్తిగత, పాత కక్షల వల్లనే జరిగిందని చెప్పడం దారుణం. మరోవైపు రషీద్‌ను నరికి చంపిన జిలానీ, వాస్తవానికి టీడీపీకి చెందినవాడైనా, అతడు తమ పార్టీ కార్యకర్త అంటూ, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ప్రచారం చేస్తోంది. నిజానికి గత ఎన్నికల్లో జిలానీ, టీడీపీ అభ్యర్థి జీవీ ఆంజనేయులు కోసం పని చేశారు అని అన్నారు.