విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కింజరాపు రామ్మోహన్ నాయుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై కీలక ప్రకటన చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అలాగే విశాఖపట్నం రైల్వే జోన్‌కు సంబంధించి భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నాల్లో ఉన్నట్లు రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఈ సారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఏపీకి న్యాయం జరుగుతుందని రామ్మోహన్ నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రానికి వివరించామని.. బడ్జెట్లో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు. అలాగే వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఏపీకి నిధులు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ విషయంలోనూ కేంద్రాన్ని వెసలుబాటు కోరుతామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.
మరోవైపు కేంద్రంలో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో టీడీపీ కీలకంగా వ్యవహరిస్తోంది. బీజేపీకి ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ సొంతంగా రాకపోవటంతో.. జేడీయూ, టీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సంకీర్ణ ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను సాధించుకోవటంతో పాటుగా భారీగా నిధులు రాబట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం చంద్రబాబు.. ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు సహకారంతో పాటుగా పెద్దమొత్తంలో నిధులు వచ్చేలా కృషి చేయాలని టీడీపీ ఎంపీలకు సూచించారు.