వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శవ రాజకీయాలు చేయడం ఇకనైనా మానుకోవాలని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు హితవు పలికారు. వినుకొండ పర్యటనలో ఏపీ ప్రభుత్వం మీద వైఎస్ జగన్ చేసిన ఆరోపణలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తిప్పికొడుతూ నాగబాబు వీడియో విడుదల చేశారు. వినుకొండ రషీద్ హత్యకు రాజకీయాలతో సంబంధం లేదన్న నాగబాబు.. పాత పగల కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవలో రషీద్ హత్యకు గురయ్యాడని చెప్పారు. రషీద్ హత్యను జనసేన తరుఫున తాము ఖండిస్తున్నట్లు చెప్పారు.
అయితే రషీద్ హత్యకు వైఎస్ జగన్, వైసీపీ రాజకీయ రంగు పులుముతోందని నాగబాబు విమర్శించారు. వైసీపీ నేతలు ఇంతకాలం శవరాజకీయాలు చేశారన్న నాగబాబు.. వైఎస్ జగన్ చెప్పే మాటలను జనం నమ్మడం మానేశారని చెప్పారు. వైసీపీ పార్టీ నాయకుడిగా రషీద్ కుటుంబాన్ని పరామర్శించడం తప్పుకాదన్న నాగబాబు.. అక్కడకు వెళ్లి ఇలా విమర్శలు చేయడం, జగనన్న పథకాలు, జగన్ మామ అని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. ఇంకా ఎంతకాలం నటిస్తారని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు.
2019లో ప్రజలు మీకు అద్భుతమైన రీతిలో అధికారం ఇచ్చారన్న నాగబాబు.. అయితే వైసీపీ పాలనలో సామాన్యుడు సైతం భయపడిపోయేలా పాలన సాగిందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంకా నెలన్నర రోజులు కూడా పూర్తి కాకముందే ఇలాంటి విమర్శలు చేయడం ఏమిటని వైసీపీని, వైఎస్ జగన్‌ను నాగబాబు ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ అనంతబాబు ఘటనల సమయంలో వైఎస్ జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న వైఎస్ జగన్ వ్యాఖ్యలకు నాగబాబు కౌంటర్ ఇచ్చారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో జరిగిన విధ్వంస పరిపాలన బహుశా స్వాతంత్య్ర భారతదేశంలో ఎప్పుడూ, ఎక్కడా జరగలేదన్న నాగబాబు.. వైసీపీ నుంచి ప్రజలు తమను తాము కాపాడుకున్నారని చెప్పారు. అప్పట్లో వైసీపీ నాయకుల దాడులు, దౌర్జన్యాల గురించి కనీసం నోరు విప్పని వైఎస్ జగన్.. ఇప్పుడు రాష్ట్రానికి ఏదో మేలు చేసినట్లు డ్రామాలు అడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఏపీ గంజాయికి కేరాఫ్‌గా మారిందన్న నాగబాబు .. వినుకొండ రషీద్ హత్యలో కూడా నిందితుడు గంజాయి తీసుకొని హత్య చేసినట్లు ప్రాథమికంగా ఒక సమాచారం ఉందని అన్నారు.
.మరోవైపు ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగి నెలన్నర కూడా కాలేదన్న నాగబాబు.. నిర్మాణాత్మక రాజకీయ పార్టీగా బాధ్యతగా వ్యవహరించాల్సిన వైసీపీ ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరుతామని, ధర్నా చేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పటికీ వైఎస్ జగన్ మాటల్లో, ప్రవర్తనలో మార్పు రాలేదన్న నాగబాబు.. ఆయనకు సలహాలు ఇస్తున్న వారు మారలేదని అన్నారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టడానికే వైఎస్ జగన్ కొత్త డ్రామా ఆడుతున్నట్లు కనిపిస్తోందని నాగబాబు విమర్శించారు. శాసనసభను ఎదుర్కోవడానికి వైఎస్ జగన్‌కు ఎందుకు అంత భయమని ప్రశ్నించారు. వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏమీ అనొద్దని కూటమి ఎమ్మెల్యేలతో తాను మాట్లాడుతానని.. శాసనసభకు రావాలని వైఎస్ జగన్‌కు నాగబాబు సూచనలు చేశారు.