బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన మానవత్వాన్ని, దానగుణాన్ని చాటుకున్నారు. మాటిచ్చిన 24 గంటల్లోనే సాయం చేసి మరోసారి తాను రియల్ హీరోనని నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాకు చెందిన దేవి కుమారి అనే యువతి చదువుకోవడానికి సాయం చేశారు సోనూసూద్. ఆ యువతికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు.
అసలు వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా బసవనూరుకు చెందిన దేవి కుమారి అనే యువతికి ఉన్నత చదువులు చదవాలనే కోరిక. బీఎస్సీ చదవాలని డిగ్రీ పట్టా అందుకోవాలనే ఆశ. అయితే ఆమె కుటుంబం ఆర్థిక పరిస్థితి అందుకు సహకరించలేదు. దీంతో చదువుకు దూరమైంది. అయితే.. తన చదువుకు సాయం చేయాలని అభ్యర్థిస్తూ దేవి కుమారి సాయం కోరింది. ఈ వీడియోను ఓ నెటిజన్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. దేవి కుమారికి సాయం చేయాలంటూ సోనూసూద్‌ను ఆ వీడియోకు ట్యాగ్ చేశారు. ఈ వీడియో సోనూసూద్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన స్పందించారు. నీ చదువు ఆగదు. కాలేజీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు, నీకు నచ్చిన కాలేజీలో జాయిన్ చేయించే బాధ్యత నాది అంటూ ఆమెకు భరోసా ఇచ్చారు సోనూసూద్.
ఈ విషయాన్ని తెలియజేసేలా ఈ ట్వీట్‌కు జులై 19న రిప్లై ఇచ్చారు. దీంతో దేవి కుమారి కుటుంబం ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోనూసూద్ స్పందనపై నెటిజనం కూడా ప్రశంసలు కురిపించారు. అయితే సాయం చేస్తానని జులై 19న మాట ఇచ్చిన సోనూసూద్.. 24 గంటలు కూడా గడవకముందే తన మాట నిలబెట్టుకున్నారు. దేవి కుమారికి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా తెలిపారు. " నీ అభిమానానికి, ప్రేమకు ధన్యవాదాలు, బాగా చదువుకో, నీ కాలేజీ అడ్మి్షన్ పూర్తైంది. మీ కుటుంబం గర్వపడేలా చేయ్ అంటూ.. సోనూసూద్ ట్వీట్ చేశారు. అలాగే గైడెన్స్ అందించినందుకు ధన్యవాదాలు అంటూ సీఎం చంద్రబాబును ట్యాగ్ చేశారు.
ఇది చూసిన నెటిజనం సోనూసూద్ తాను రియల్ హీరోనని మరోసారి నిరూపించుకున్నారని కామెంట్లు పెడుతున్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో ఎంతోమంది వలస కార్మికులను తమ సొంతూళ్లకు చేర్చి సోనూసూద్ మంచి పేరు తెచ్చుకున్నారు. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగుపడినప్పటికీ.. సోనూ ఫౌండేషన్ స్థాపించి ఎంతో మంది విద్యార్థులకు, పేదలకు సాయం చేస్తున్నారు.