కర్నూలు జిల్లా హోలగుంద మండలం మార్లమడి గ్రామానికి బస్సు సౌకర్యం లేదు. దీంతో ఊరి నుంచి ఏదైనా పనికోసం బయటకు వెళ్లాలంటే గ్రామస్థులకు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఆటోలు, జీపులు వంటివి ఉన్నప్పటికీ ఏ టైమ్‌కు వస్తాయనేదీ తెలియని పరిస్థితి. ఆర్థికంగా కాస్త ఉన్న వారు అయితే బైక్ లాంటి వ్యక్తిగత వాహనాలు సమకూర్చుకున్నారు. అయితే మెజారిటీ ప్రజలు నిరుపేదలు కావటంతో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా విద్యార్థులు సకాలంలో పాఠశాలలకు వెళ్లలేక అవస్థలు పడ్డారు.
దీంతో తమ సమస్యను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లాలని ఆ విద్యార్థులు నిర్ణయించుకున్నారు. ఇందుకు విద్యార్థి సంఘాల సాయం తీసుకున్నారు. విద్యార్థి సంఘాల నేతల సహాయంతో మంత్రి నారా లోకేష్‌కు మెయిల్ పంపారు. తమ ఊరికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలంటూ మంత్రి నారా లోకేష్‌కు మెయిల్ చేశారు. దీనిపై నారా లోకేష్ వెంటనే స్పందించారు. ఈ విషయాన్ని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో రవాణామంత్రి రంగంలోకి దిగారు. ఆయన ఆదేశాలతో ఆదోనీ ఆర్టీసీ డిపో అధికారులు మార్లమడి గ్రామానికి బస్సు సర్వీసును ప్రారంభించారు. దీంతో మంత్రి నారా లోకేష్‌కు విద్యార్థి సంఘాలు, మార్లమడి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.
అయితే మంత్రి నారా లోకేష్ విదేశాలకు వెళ్లి చిక్కుకుపోయిన తెలుగు ప్రజల విషయంలోనూ ఇదే రీతిలో సత్వరమే స్పందించి మన్ననలు అందుకున్నారు. కువైట్ వెళ్లి చిక్కుకుపోయిన అన్నమయ్య జిల్లాకు చెందిన శివ అనే వ్యక్తి.. నారా లోకేష్ జోక్యంతోనే తిరిగి సొంత ఊరికి చేరుకుని కుటుంబాన్ని కలుసుకోగలిగాడు. అలాగే ఖతార్‌లో చిక్కుకుపోయిన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన వీరేంద్రను సైతం లోకేష్ సొంతూరికి రప్పించే ప్రయత్నాల్లో ఉన్నారు.
మంచి జీతంతో ఉద్యోగం ఇప్పిస్తానన్న ఏజెంట్ మాటలు నమ్మి వీరేంద్ర ఖతార్ వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత వీరేంద్రను ఎడారి ప్రాంతంలో పనికి పెట్టారు. దీంతో తాను మోసపోయానని.. ఇంటికి పంపించాలని వేడుకుంటూ వీరేంద్ర వీడియో తీయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో లోకేష్ వరకూ చేరగా.. వీరేంద్రను సొంతూరికి చేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు.