పవన్ కళ్యాణ్ భద్రత ఇపుడు ఏపీలో ఎంతో కీలకంగా మారింది. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావన వచ్చిందని.. ఈ నేపథ్యంలోనే ప్రతీ నిమిషం జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసిన ఆ గ్రూపులు ఏంటి అనేవి మాత్రం ఇప్పుడే చెప్పలేమని నిఘా వర్గాలు పేర్కొన్నాయి. తన భద్రత పట్ల పవన్ కళ్యాణ్ గట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించాయి.
పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ పట్ల కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో.. కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్‌కు జడ్ ప్లస్ సెక్యూరిటీ కల్పించే అవకాశాలున్నాయని సమాచారం. ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉండడం.. ప్రధాని నరేంద్ర మోదీకి ఎప్పటికప్పుడు మద్దతు తెలుపుతుండటంతో.. పవన్ కళ్యాణ్‌ను మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. కొంతమంది ఫోన్ కాల్స్ ట్రాకింగ్ చేసినప్పుడు వారి మధ్య పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు ఆయనకు హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ భద్రతపై నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో జనసేన కార్యకర్తలతోపాటు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి పోటీ చేశాయి. ఈ క్రమంలోనే 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన 21 స్థానాల్లో బంపర్ మెజార్టీతో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాకుండా అందుకు సంబంధించిన ఆరాధనలు, ఆచార వ్యవహారాలు పాటిస్తున్నారు. ఈ క్రమంలోనే హిందూ వ్యతిరేక శక్తులు దాడి చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న తీరును తప్పుబడుతూ మావోయిస్టులు ఇప్పటికే కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర వర్గాలు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి గానీ.. జనసేన వర్గాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.