ఏపీలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాలు వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉత్తరాంధ్ర జిల్లాలలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అనేక చోట్ల పంటలు నీటమునిగిపోయి రైతులు లబోదిబోమంటున్నారు. వీధుల్లోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రానికి వాయుగుండం బలహీనపడింది. అయినప్పటికీ మరో రెండురోజుల పాటు ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో చాలా చోట్ల మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు వర్షాలు, వరదల నేపథ్యంలో పశ్చిమ గోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు సోమవారం సెలవు ప్రకటించారు. ఈ విషయాన్ని స్థానిక కలెక్టర్లు తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం డివిజన్‌లోని నాలుగు మండలాల్లోనూ సెలవులు ప్రకటించారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అయితే పాడేరు డివిజన్‌లో మాత్రం విద్యాసంస్థలు కొనసాగనున్నాయి.
మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదిలో వరద ప్రభావం పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటిమట్టం పది అడుగులు దాటగా.. అధికారులు 7.5 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అటు పోలవరం ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే వద్ద నీటిమట్టం 31.7 మీటర్లకు చేరగా.. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వర్షాలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ జిల్లాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కోనసీమ జిల్లాలో లంక భూములు కోతకు గురై.. గోదావరి నదిపాయలో కలిసిపోతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.