బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తున్నాయి. కాగా, నేడు కూడా ఏపీలో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య దిశగా పయనించి పూరీ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని వెల్లడించింది.
దీని ప్రభావంతో నేడు ఏలూరు, అల్లూరి సీతారామరాజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. పార్వతీపురం మన్యం,నంద్యాల, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని వెల్లడించారు. కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలం పనులకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఏపీలో యావరేజ్‌గా గంటకు 19 నుంచి 23 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పింది. వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు. ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని అవసరం అయినేతే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఇక గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. రోడ్లు కోతకు గురి కావడంతోపాటు, రహదారులపైకి పెద్దఎత్తున వర్షపు నీరు చేరింది.
రాష్ట్ర వ్యాప్తంగా లక్ష ఎకరాలకు పైగా వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కృష్ణా నదిలో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. పులిచింతల, ప్రకాశం బ్యారేజీలకు కూడా నీటి ప్రవాహం కొనసాగుతోంది.