గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకువచ్చిన అనేక విధానాలను మారుస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. ఈసారి మత్స్యకారులకు ఊరట నిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్య కార్మికులకు ఇబ్బందికరంగా ఉన్న 217 జీవో రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఏపీ వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాది వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నకు అచ్చెన్నాయుడు సమాధానం ఇచ్చారు. మత్స్యకారులను ఇబ్బంది పెట్టే ఈ జీవోను రద్దు చేస్తామని గతంలో చంద్రబాబు చెప్పారన్న అచ్చెన్నాయుడు.. ఆ మేరకు త్వరలోనే మంత్రివర్గ సమావేశంలో జీవోను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ జీవోపై గతంలోనూ ఆందోళనలు జరిగిన విషయాన్ని అచ్చెన్నాయుడు గుర్తుచేసుకున్నారు. మత్స్యకారులకు ఉరితాడులాగా మారిన ఈ జీవోను రద్దు చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు 217 జీవో ద్వారా చెరువుల్లో చేపలు పట్టడానికి టెండర్లు పిలిచేవారు. టెండర్లు దక్కించుకున్నవారికి చేపలు పట్టుకునే హక్కు లభించేది. అయితే దీనిపై గతంలో విపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీ పోరాటాలు చేశాయి. మత్స్యకారులకు సొంతూర్లలో చేపలు పట్టుకునే అవకాశం లేకుండా చేస్తుందని.. మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలుగుతుందని ఆందోళన చేపట్టారు. ఏళ్ల తరబడి చెరువుల్లో చేపలు పట్టుకునే జీవించే కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళనలు చేపట్టారు.
అయితే వంద ఎకరాల కంటే ఎక్కువ ఉన్న చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని అప్పటి వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. మత్స్యకారుల అభ్యున్నతి కోసమే జీవో 217 జారీ చేసినట్లు చెప్పుకొచ్చింది. వంద ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదని స్పష్టం చేసింది. అయితే అప్పట్లో ప్రభుత్వం ఎంత క్లారిటీ ఇచ్చినప్పటికీ మత్స్యకార కుటుంబాల్లో దీనిపై అభద్రతా భావం ఉండేది. దీంతో తాము అధికారంలోకి వస్తే జీవో నంబర్ 217ను రద్దుచేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇక హామీ మేరకు త్వరలోనే ఏపీ మంత్రివర్గ సమావేశంలో జీవో 217 రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు క్లారిటీ ఇచ్చారు