ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం వైసీపీ ప్రభుత్వ పాలనలో పూర్తిగా పడకేసింది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులకు మొగ్గుచూపడంతో.. అమరావతిలో అప్పటికే చేపట్టిన నిర్మాణాలు కూడా ఆగిపోయాయి. అయితే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచి అధికారంలోకి రావటంతో అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే అమరావతికి మరో గుడ్ న్యూస్ రానుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం బడ్జెట్‌లో రూ.15000 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు జోరందుకుంటాయని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే సింగపూర్ కూడా అమరావతి నిర్మాణంలోకి తిరిగి వస్తుందనే వార్తలు వెలువడుతున్నాయి. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అమరావతికి రూ.15000 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ భారతదేశంలోని సింగపూర్ హైకమిషనర్ చేసిన ట్వీటే ఇందుకు కారణమవుతోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు 15 వేల కోట్లు కేటాయించడం సంతోషం. ఇందుకు ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. త్వరగా రావాలని కోరుకుంటున్నా.. అంటూ భారత్‌లోని సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్ ట్వీట్ చేశారు. దీంతో ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలోని సింగపూర్ మరోసారి ఎంట్రీ ఇస్తుందా అనే వార్తలు, విశ్లేషణలు మొదలయ్యాయి.
మరోవైపు 2017లో నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం.. సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా రెండు ప్రభుత్వాలు కలిసి అమరావతి రాజధాని సిటీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేయాలని సంకల్పించాయి.15 ఏళ్లల్లో మూడు దశల్లో మొత్తం 6.84 చదరపు కిలోమీటర్ల పరిధిలో దీనిని అభివృద్ధి చేయాలని ఒప్పందం చేసుకున్నాయి. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. పలు కారణాలతో అమరావతి స్టార్టప్ ప్రాజెక్టు నుంచి సింగపూర్ తప్పుకుంది. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రభుత్వం కూడా మూడు రాజధానుల వైపు మొగ్గు చూపడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది.
అయితే ఇప్పుడు మరోసారి ఏపీలో టీడీపీ అధికారంలోకి రావటంతో .. అమరావతిలోకి సింగపూర్ ఎంట్రీ ఇస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. అమరావతికి రూ.15000 కోట్లు కేటాయించడం మీద సింగపూర్ హైకమిషనర్ చేసిన ట్వీట్‌తో ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా మారింది. నెటిజనం కూడా దీనిపై పోస్టులు పెడుతున్నారు. మరి సింగపూర్ ప్రభుత్వం వస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.