కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్ లో సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేసింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు జీవితాంతం 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి సూర్య ఘర్ బిజిలీ యోజన తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్‌పై జులై 23వ తేదీ మంగళవారం రోజున పార్లమెంటులో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. రూఫ్ టాప్ సోలరైజేషన్ స్కీమ్ ద్వారా దేశంలోని కోటి కుటుంబాలకు ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పొందే అవకాశం లభిస్తుందన్నారు. ఈ స్కీమ్ ద్వారా ఉచితంగా విద్యుత్తును వాడుకోవడంతో పాటు మిగులు కరెంటును డిస్కమ్‌లకు విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చన్నారు.
'మధ్యంతర బడ్జెట్‌లో చేసిన ప్రకటనకు కొనసాగింపుగా.. పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రకటిస్తున్నాం. దీని ద్వారా 1 కోటి గృహాలకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్తు పొందే అవకాశం లభిస్తుంది. ఈ పథకాన్నికి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే 1.28 కోట్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. ముందు ముందు మరిన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.' అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
తొలుత రూఫ్ టాప్ సోలరైజేషన్ పేరుతో ఈ పథకాన్ని ప్రకటించిన కేంద్రం దానిని తర్వాత ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనగా మార్చింది. సౌర విద్యుత్తు వినియోగాన్ని విస్తరించి మధ్యతరగతి ప్రజలపై విద్యుత్తు ఛార్జీల భారాన్ని తగ్గించాలని ఈ స్కీమ్ తీసుకొచ్చినట్లు కేంద్రం ప్రకటించింది. మధ్యంతర బడ్జెట్కు ముందే ఈ పథకానికి రూ.75 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇలా అప్లై చేసుకోండి..
ముందుగా pmsuryaghar.gov.in వెబ్‌సైట్ లోకి వెళ్లాలి. మొదటగా తమ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వత మీ రాష్ట్రం పేరు, విద్యుత్తు సరఫరా చేసే కంపెనీ ఎంచుకుని, మీ కనెక్షన్ నంబర్, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఇవ్వాలి.
రిజిస్ట్రేషన్ పూర్తయితే మీ వినియోదారు నంబర్, మొబైల్ నంబర్‌తో లాగిన్ కావాలి.
అందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ అప్లికేషన్ కనిపిస్తుంది. పూర్తి వివరాలు దరఖాస్తులో నింపి సమర్పించాలి.
ఆ తర్వాత డిస్కమ్ అనుమతుల కోసం వేచి ఉండాలి. అనుమతులు వచ్చాక డిస్కమ్‌లోని లిస్టెడ్ విక్రయదారుల నుంచి సోలార్ ప్లాంటును మీ ఇంటిపై ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ విద్యుత్తు ప్లాంట్ వివరాలను పోర్టల్‌లో నమోదు చేయాలి. ఆ తర్వాత నెట్ మీటర్ కోసం అప్లై చేయాలి.
నెట్ మీటర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు. తనిఖీలు పూర్తయిన తర్వాత కమిషనింగ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు.
ఈ సర్టిఫికెట్ వచ్చాక మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు, క్యాన్సిల్ చేసిన చెక్ పోర్టల్‌లో ఇవ్వాలి. ఆ తర్వాత 30 రోజులలోగా సబ్సిడీ డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి.