వైసీపీ ప్రభుత్వ హయాంలో కేవలం సంక్షేమ పథకాలకే ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని దీన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ముమ్మిడివరం నగర పంచాయతీ ప్రజల సౌకర్యాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్ అడబాల సతీష్‌కుమార్, ఫ్లోర్‌లీడర్ ములపర్తి బాలకృష్ణ పేర్కొన్నారు. నగర పంచాయతీ కౌన్సిల్ సమావేశం చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన శనివారం జరిగింది. సమావేశంలో ఫ్లోర్ లీడర్ బాలకృష్ణ, కౌన్సిలర్ సతీష్‌కుమార్‌లు మాట్లాడుతూ గత 20 రోజులుగా వర్షాలు విపరీతంగా కురవడంతో రోడ్లపై నీరు దిగకపోవడంతో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా మారి దోమలు పెరిగి ప్రజలు డెంగ్యూ జ్వరాలబారిన పడుతున్నారని, బ్లీచింగ్, క్లోరినేషన్, ఫాగింగ్ వంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 7, 8 వార్డులు సాయినగర్‌లో డ్రైన్ అవుట్‌లెట్ మూసుకుపోయాయన్నారు. అక్కడ చర్చిని నిర్మిస్తున్నవారు, అపార్టుమెంటువారు వేస్ట్ మెటీరియల్‌ను పడవేయడంతో డ్రైనేజీలు మూసుకుపోయి మురుగునీరు దిగడంలేదని, దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్లీచింగ్, క్లోరినేషన్ సక్రమంగా చేయడంలేదని వారు ఆరోపించారు. ప్రస్తుత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు 20 వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని, నిధుల సమస్య ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవచ్చన్నారు. మాగాం-అయినాపురం పంటకాల్వ తొట్టె రక్షణగోడ కొంతమేర కూలిపోవడం, చెత్తాచెదారం పేరుకుపోవడంతో వాటి మరమ్మతులకు ఎమ్మెల్యే రూ.4లక్షలు ప్రత్యేక గ్రాంటును విడుదలచేసి పనులు చేయించారని కౌన్సిలర్ సతీష్‌కుమార్ ఈ సందర్భంగా వివరించారు. టౌన్‌ప్లానింగ్ విభాగం అస్తవ్యస్తంగా మారిందని, ఒక్క ఆదివారం మాత్రమే ఇంటికి శ్లాబ్ వేసుకునే పరిస్థితి వచ్చిందని, టౌన్ ప్లానింగ్ ఉద్యోగుల వేధింపులు ఎలా ఉన్నాయో అర్థం అవుతుందని వైసీపీ కౌన్సిలర్ బొంతు సత్య శ్రీనివాసరావు ఆరోపించారు. టౌన్ ప్లానింగ్ అధికారుల వైఖరి మార్చుకోకపోతే ఆర్జేడీ వద్ద ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సచివాలయ ప్లానర్లు అప్రూవల్‌కు వచ్చిన దరఖాస్తులను 15 రోజులైనా లాగిన్‌లో ఉంచుకుంటున్నారని, రెండు రోజుల వ్యవధిలో క్లియరెన్స్ చేయాల్సిన వాటికి ఎందుకు అంత జాప్యం చేస్తున్నారని చైర్మన్ కమిడి ప్రవీణ్‌కుమార్ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీరు సక్రమంగా సరఫరా కావడంలేదని, మురుగునీటి మలినాలు వస్తున్నాయని, వాటర్ ట్యాంకును శుభ్రం చేయడంలేదని కౌన్సిలర్ అడబాల సతీష్‌కుమర్, ములపర్తి బాలకృష్ణ, బొంతు సత్యశ్రీనివాస్‌లు ఆరోపించారు. దీనిపై ఏఈ సత్యనారాయణ వివరణ ఇస్తూ మోటార్లతో అక్రమంగా నీటిని వినియోగించడంవల్ల ఈ పరిస్థితి వస్తుందని వివరించారు. అలాగే కౌన్సిల్‌లో పలు విషయాలపై చర్చ జరిగింది. సమావేశంలో వైస్ చైర్మన్లు రెడ్డి హేమసుందరి, వేటుకూరి బోసురాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.