దొంగతనం చేస్తూ దొరికిపోయి.. మరోసారి ఇలాంటి తప్పు చేయను కాపాడు దేవుడా అని భయపడేవాళ్లు ఒకరైతే.. పట్టుబడటం అవమానంగా ఫీలైపోయే రకం దొంగలు రెండో టైపు. ఇదిగో ఇలాంటి వ్యవహారమే ఇప్పుడు ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. దొంగతనం చేస్తూ అడ్డంగా దొరికిపోయారు కొంతమంది దొంగలు. దీంతో ఊరందరూ కలిసి వారికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. అయితే ఇక్కడే మన దొంగ గ్యాంగ్ ఫీలింగ్స్ హర్ట్ అయ్యినట్టు ఉన్నాయి. దీంతో పోయినకాడే వెతుక్కోవాలని భావించి మరోసారి దొంగతనానికి వచ్చారు. అడ్డంగా బుక్కయ్యారు.
అసలు వివరాల్లోకి వస్తే.. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గోనెపల్లి గ్రామంలో పోలేరమ్మ గుడి ఉంది. అయితే ఈ గుడిపై కొన్నిరోజుల కిందట ఓ దొంగలముఠా కన్నుపడింది. ఓ రోజు ప్లాన్ చేసి ఎవరూ లేని సమయం చూసి గుడిలోకి ప్రవేశించారు. నగలు, హుండీ మొత్తం సర్దేశారు. ప్లా్న్ వర్కవుట్ అయ్యిందని సంబరపడుతూ.. బయల్దేరడానికి రెడీ అయ్యారు. అయితే ఈలోపే దొంగల సంగతిని పసికట్టిన స్థానికులు వారిని చుట్టుముట్టారు. మా ఊరి గుడిలో దొంగతనం చేస్తారా అంటూ చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. అయితే ఈ తతంగమంతా దొంగల మనోభావాలను దెబ్బతీసినట్టుంది. దొంగతనానికి వచ్చి దొరికిపోయి, గ్రామస్థుల చేతిలో దెబ్బలు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు.
స్టేషన్ నుంచి బయట పడిన తర్వాత మరోసారి ఆ గుడికే కన్నమేయాలని దొంగలు డిసైడ్ అయ్యారు. పోలేరమ్మ గుడిలోనే చోరీకి పాల్పడ్డారు. నగదు, నగలు తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. అయితే చోరీ విషయం తెలుసుకుని గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. చోరీ కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో పాత కేసులున్న దొంగలను అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో అసలు విషయం బయటపడింది. గతంలో ఆ గుళ్లో దొంగతనం చేసిన వారే మరోసారి చోరికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఊరి జనం కొట్టారనే కోపంతోనే మరోసారి ఆ గుడిలోనే దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు.