పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కన్నాపురం ఐటీడీఏ ఆఫీసును ఆకస్మికంగా తనిఖీ చేశారు. మాస్కు, క్యాపు ధరించి సామాన్యుడిలా కార్యాలయానికి వెళ్లారు. ఈ సమయంలో D. Y. E. O సెక్షన్ O. S.. సాయి కుమార్ అనే ఉద్యోగి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎమ్మెల్యే గమనించారు. డ్యూటీ టైమ్‌లో పబ్‌జీ ఆడుతూ సాయి కుమార్ కనిపించారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి.. డ్యూటీ టైమ్‌లో విధులు మాని.. పబ్జీ గేమ్ ఆడటం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం సదరు సాయి కుమార్ అనే ఉద్యోగిని సస్పెండ్ చేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఆదేశించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
దీంతో ఎమ్మె్ల్యే చిర్రి బాలరాజుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విధుల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరోవైపు చిర్రి బాలరాజు విషయానికి వస్తే జనసేన తరఫున పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో జనసేన తరుఫున పోలవరం నుంచి బరిలోకి దిగిన బాలరాజు.. 13 వేల ఓట్లు మాత్రమే సంపాదించి మూడో స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2024 ఏపీ ఎన్నికల్లో మరోసారి జనసేన తరుఫున పోటీ చేసిన చిర్రి బాలరాజు.. సమీప వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మిపై సుమారుగా 8 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరోవైపు ఇటీవలే జనసేన కార్యకర్తలు చందాలు వేసుకుని చిర్రి బాలరాజుకు కారు కొనివ్వడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే ఈ బహుమతిని సున్నితంగా తిరస్కరించి అందరికీ ఆదర్శంగా నిలిచారు బాలరాజు. ఇప్పుడు మరోసారి మారు వేషంలో ఆకస్మిత తనిఖీలు చేసి శెభాష్ అనిపించుకుంటున్నారు.